Revanth Reddy cyclone preparedness instructions : ‘మొంథా’ తుపాను రూపంలో ముంచుకొస్తున్న ముప్పుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యావత్ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉరుకులు పెట్టించారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా కంటికి రెప్పలా కాపాడాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రానీయొద్దని కఠిన ఆదేశాలు జారీ చేశారు.
విభాగాల వారీగా సీఎం ఆదేశాలు : క్షణం తీరిక లేకుండా, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రైతన్నలకు రక్షణగా: ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని అంచనా. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, కొనుగోలు కేంద్రాల్లోని పత్తి తడవకుండా తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలి.
ప్రయాణికులకు అండగా: గోల్కొండ, కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లు నిలిచిపోవడం, పలు రైళ్లను దారి మళ్లించడంతో చిక్కుకుపోయిన ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి.
లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి: వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను ముందస్తుగా గుర్తించి, సహాయక శిబిరాలకు తరలించాలి.
READ MORE: https://teluguprabha.net/telangana-news/jubilee-hills-azharuddin-cabinet-congress-sketch-behind-it/
జలవనరుల పర్యవేక్షణ: నీటిపారుదల శాఖ అధికారులు రిజర్వాయర్లు, చెరువుల నీటిమట్టాన్ని నిరంతరం గమనించాలి. నీటి విడుదలపై క్షేత్రస్థాయి సిబ్బందికి ముందుగానే సమాచారం ఇవ్వాలి. నిండిన జలాశయాల వద్ద ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలి.
రహదారులపై కట్టడి: లో-లెవల్ వంతెనలు, కాజ్‌వేలపై రాకపోకలను పూర్తిగా నిషేధించి, సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసు, రెవెన్యూ సిబ్బంది పర్యవేక్షించాలి.
విపత్తు నిర్వహణ, ఆరోగ్య సంరక్షణ : విపత్తు సమయంలో, ఆ తర్వాత ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం దిశానిర్దేశం చేశారు.
సత్వర స్పందన బృందాలు: అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలి. కలెక్టర్లు ఆయా బృందాలకు మార్గనిర్దేశం చేయాలి. హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ, హైడ్రా, అగ్నిమాపక బృందాలు ప్రజల ఫిర్యాదులపై తక్షణం స్పందించాలి.
READ MORE: https://teluguprabha.net/telangana-news/shocking-scenes-at-kurnool-bus-accident/
అంటువ్యాధులపై అప్రమత్తత: వర్షపు నీరు నిలిచి దోమలు విజృంభించకుండా పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరం పనిచేయాలి. వైద్యారోగ్య శాఖ అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకుని, అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి.
మంత్రుల రంగ ప్రవేశం : సీఎం ఆదేశాల మేరకు మంత్రులు సైతం రంగంలోకి దిగారు. మంత్రి సీతక్క మహబూబాబాద్, ములుగు జిల్లాల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, అత్యవసర చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. మొత్తం మీద, మొంథా తుపానును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సర్వసన్నద్ధమైంది.


