Sunday, November 16, 2025
HomeతెలంగాణCM Revanth Reddy:'నా కోసం కాదు, భవిష్యత్ తరాల కోసం': ఫ్యూచర్ సిటీపై సీఎం రేవంత్...

CM Revanth Reddy:’నా కోసం కాదు, భవిష్యత్ తరాల కోసం’: ఫ్యూచర్ సిటీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

Bharat Future City: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా స్పందించారు. ఈ ప్రాజెక్టుపై వస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. రంగారెడ్డి జిల్లా, మీర్‌ఖాన్‌పేటలో ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) కార్యాలయానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు.

- Advertisement -

‘భూములున్నాయి కాబట్టే కడుతున్నారు’ అని తనపై కొందరు చేస్తున్న ఆరోపణలను ప్రస్తావిస్తూ… “ఈ ఫ్యూచర్‌ సిటీ నా కోసం కాదు, భవిష్యత్తు తరాల కోసమే నిర్మిస్తున్నాం” అని స్పష్టం చేశారు.

న్యూయార్క్‌ను మరిపించే నగరం నా లక్ష్యం!
గత పాలకుల నుంచి మంచిని నేర్చుకోవాలని చెబుతూ.. చంద్రబాబు నాయుడు హయాంలో హైటెక్ సిటీ, వైఎస్సార్ హయాంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, ఓఆర్‌ఆర్ వంటి నిర్మాణాలు వచ్చాయని గుర్తు చేశారు. “ఎన్నాళ్లు న్యూయార్క్, సింగపూర్, దుబాయ్ గురించి చెప్పుకొంటాం? మనం కూడా అలాంటి నగరాలను నిర్మించుకోవాలి కదా” అని ఆయన ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి తన విజన్‌ను వివరిస్తూ, “నాకు పదేళ్లు సమయం ఇవ్వండి.. న్యూయార్క్‌ను మరిపించే నగరం కట్టి చూపిస్తా” అని ధీమా వ్యక్తం చేశారు. 70 ఏళ్ల తర్వాత కూడా ప్రపంచం మన గురించి మాట్లాడుకునే పనులు చేయాలన్నదే తన లక్ష్యమని తెలిపారు.

500 ఫార్చ్యూన్ కంపెనీలు, 12 లేన్ల రోడ్డు
భారత్ ఫ్యూచర్‌ సిటీకి కావాల్సిన అన్ని అవకాశాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక్కడి నుంచి చెన్నైకి బుల్లెట్ రైలు (వయా అమరావతి) ప్రాజెక్టుకు కేంద్రం అంగీకారం తెలిపిందని వెల్లడించారు. ఈ నగరంలో 500 ఫార్చ్యూన్ కంపెనీలు కొలువు తీరాలన్నది తన స్వప్నమని, ప్రస్తుతం హైదరాబాద్‌లో 80 కంపెనీలే ఉన్నాయని గుర్తు చేశారు.

దక్షిణ భారతదేశంలో పోర్టు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ కావడంతో, ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నానికి 12 లేన్ల రోడ్డు వేయనున్నట్లు సీఎం ప్రకటించారు. అభివృద్ధి పనుల వల్ల నష్టపోయేవారిని అన్నివిధాలా ఆదుకుంటామని, చిన్న చిన్న సమస్యల కోసం కోర్టులకు వెళ్లి అభివృద్ధిని ఆపవద్దని ఆయన అభ్యర్థించారు. FCDA కార్యాలయం మరియు స్కిల్ యూనివర్సిటీలను డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad