తెలంగాణ ప్రభుత్వం మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. మూసీ ప్రక్షాళన జరిగితే హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బలంగా నమ్ముతున్నారు. అందులో భాగంగా శుక్రవారం ఆయన మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర చేశారు. యాదాద్రి జిల్లా సంగెం నుంచి రెండున్నర కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో పరిస్థితులను గమనించారు. నదిలో బోటు ప్రయాణం చేశారు, నీటిని పరిశీలించారు.
Also Read : ‘కాంగ్రెస్ మాట తప్పి భూముల కోసం బెదిరిస్తోంది’
పాదయాత్ర అనంతరం నాగిరెడ్డిపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… “మూసీ పరివాహక ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. మూసీ ఒకప్పుడు జీవనదిగా ఉండేది. మూసీ పరివాహక ప్రాంతాల్లో.. నీళ్లు, కూరగాయలు, పాలు అన్నీ కలుషితమయ్యాయి. మూసీ నీటితో పండించిన పంటలకు ధర లభించడం లేదు” అని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి, నల్గొండ జిల్లా ప్రజలను కాపాడటం కోసం అనేక సమీక్షలు చేశాం. ఎంతో మందితో చర్చించిన తర్వాతే మూసీ పునరుజ్జీవం కోసం ప్రయత్నిస్తున్నాం అని రేవంత్ వెల్లడించారు.