విశ్వగురు బసవేశ్వరుడి(Basaveswarudu) స్ఫూర్తితోనే ప్రజా ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హుగ్గెల్లిలో ఏర్పాటు చేసిన బసవేశ్వర మహారాజ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.
అనంతరం మాట్లాడుతూ.. బసవన్న స్ఫూర్తితోనే రాష్ట్రంలో కుల గణన చేపట్టామని అన్నారు. బసవేశ్వరుడు సామాజిక న్యాయం అందించేందుకు ఎంతో కృషి చేశారని విశ్వగురు విధానాలను స్మరించుకున్నారు. బసవన్న స్ఫూర్తి సందేశానికి అనుగుణంగా ప్రభుత్వం ముందుకు వెళుతోందని, వారి సందేశమే పరిపాలనకు సూచిక అని తెలిపారు. పేదలకు న్యాయం జరగాలని ఆనాడు అనుభవ మంటపాల ద్వారా తెలుసుకున్న విశ్వగురు ఆదర్శంగానే ప్రస్తుతం పార్లమెంట్, శాసనసభలు నిర్వహించుకుంటున్నామని వివరించారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి రామోదర్ రాజనర్సింహా, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.