Saturday, November 15, 2025
HomeTop StoriesOsmania Hospital : "ఉస్మానియాకు కొత్త రూపు.. రెండేళ్లలో నిర్మాణం పూర్తి కావాల్సిందే!"

Osmania Hospital : “ఉస్మానియాకు కొత్త రూపు.. రెండేళ్లలో నిర్మాణం పూర్తి కావాల్సిందే!”

Osmania Hospital new building construction : దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ, చారిత్రాత్మక ఉస్మానియా ఆసుపత్రికి కొత్త రూపు రాబోతోంది. నూతన ఆసుపత్రి నిర్మాణ పనులను రెండేళ్లలోగా పూర్తిచేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు గట్టిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ బృహత్తర ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు ఏకంగా ఓ సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తూ, పనుల పురోగతిపై స్వయంగా పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు. అసలు ఈ కొత్త ఆసుపత్రి ఎలా ఉండబోతోంది? ఈ ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు సీఎం వేసిన ప్రణాళికలేంటి..?

- Advertisement -

ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

రెండేళ్ల లక్ష్యం: “ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణం రెండు సంవత్సరాల్లో పూర్తి కావాలి. ఎలాంటి జాప్యాన్ని సహించేది లేదు,” అని సీఎం స్పష్టం చేశారు.
సమన్వయ కమిటీ: నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు వైద్యారోగ్య, పోలీసు, జీహెచ్‌ఎంసీ, ఆర్&బీ, విద్యుత్ శాఖ అధికారులతో ఓ సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కమిటీ ప్రతి 10 రోజులకోసారి సమావేశమై, క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

ట్రాఫిక్ సమస్యలు రావొద్దు: ఆసుపత్రి నిర్మాణం వల్ల, ఆ తర్వాత కూడా ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని పోలీసు, ఆర్&బీ అధికారులకు సూచించారు.
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా : కేవలం భవన నిర్మాణమే కాకుండా, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించాలని సీఎం అన్నారు. నూతన ఆసుపత్రికి అవసరమైన అత్యాధునిక వైద్య పరికరాల కొనుగోలుకు, వాటికి అనుగుణంగా గదులు, ల్యాబ్‌లు నిర్మించాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు.

ఎలా ఉండబోతోంది కొత్త ఉస్మానియా : ఈ ఏడాది జనవరి 31న సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన ఈ నూతన భవనం, గోషామహల్ మైదానంలో రూపుదిద్దుకోనుంది.
విశాలమైన ప్రాంగణం: 26.30 ఎకరాల విస్తీర్ణంలో, రూ.2,400 కోట్ల అంచనా వ్యయంతో ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు.
2,000 పడకల సామర్థ్యం: 14 అంతస్తులలో నిర్మించే ఈ భవనంలో 2,000 పడకలు అందుబాటులో ఉంటాయి.
అత్యాధునిక సేవలు: రోబోటిక్ సర్జరీలతో సహా, 30కి పైగా విభాగాల్లో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తారు.
పెరగనున్న వైద్యులు: కొత్త ఆసుపత్రి పూర్తయితే, వైద్యుల సంఖ్య 20% పెరగనుంది. రోజూ సుమారు 5,000 మందికి ఓపీ సేవలు అందించేలా దీనిని అభివృద్ధి చేయనున్నారు.
ఈ సమీక్షా సమావేశంలో, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో నిర్మిస్తున్న ఆసుపత్రులు, వైద్య కళాశాలల నిర్మాణాలను కూడా వచ్చే జూన్ నాటికి పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad