CM Revanth: తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన కులగణన దేశానికి మార్గదర్శకంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద జరుగుతున్న బీసీ హక్కుల కోసం జరుగుతున్న ధర్నాలో పాల్గొన్న ఆయన, బీసీల సామాజిక న్యాయం కోసం తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మీడియాకు వివరించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ, “రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో బీసీలకు న్యాయం జరగాలన్న ఆశయం వ్యక్తం చేశారు. అదే దిశగా తెలంగాణలో మేము ముందడుగు వేశాం. విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ప్రత్యేక బిల్లును ఆమోదించాం,” అని తెలిపారు. అయితే ఆ బిల్లులు రాష్ట్రపతి ఆమోదానికి పంపినప్పటికీ ఇప్పటివరకు ఆమోదం లభించలేదని అన్నారు.
“రాష్ట్రపతిని కలిసి బీసీల బిల్లులపై వినతిపత్రం ఇవ్వాలన్నమా యత్నం ఇప్పటివరకు ఫలించలేదు. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఇవ్వొద్దని ప్రధాని మోదీ ఒత్తిడి తెస్తున్నారన్న అనుమానం మాకు ఉంది,” అని పేర్కొన్నారు. బిల్లులు ఆమోదం పొందే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో నిర్వహించిన కులగణనతో బీసీల వాస్తవ స్థితి బయటపడిందని, ఇది దేశవ్యాప్తంగా జరగాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం బీసీల గణాంకాలపై మౌనంగా ఉండడం అర్థం చేసుకోలేనిదన్నారు. “బీసీలను రాజకీయంగా ఉపయోగించుకునే మైనోరిటీగా చూపిస్తూ, అసలు న్యాయం జరగకుండా కేంద్రం ఆటలు ఆడుతోంది” అని ఆరోపించారు.
ఈ క్రమంలో బీసీల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, రాష్ట్రాల నుంచి వచ్చిన బిల్లులను ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీలకు న్యాయం చేయాలంటే కేవలం మాటలు కాకుండా, చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన హితవు పలికారు.


