తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో వామపక్ష పార్టీల ప్రతినిధుల బృందం శనివారం భేటీ అయింది. ఫార్మాసిటీ (Pharma City) పేరుతో లగచర్ల గ్రామస్తులను ఇబ్బందికి గురి చేయవద్దని, భూసేకరణ పరిహార పెంపును కూడా పరిశీలించాలని వామపక్ష నేతలు సీఎంని కోరారు. ఈ మేరకు లగచర్ల ఘటనపై సీఎంకి వినతి పత్రం అందజేశారు. వారి వినతిపై సానుకూలంగా స్పందించిన సీఎం… భూసేకరణ పరిహార పెంపును పరిశీలిస్తామని స్పష్టం చేశారు.
కొడంగల్ లో ఏర్పాటు చేసేది ఫార్మాసిటీ (Pharma City) కాదని తేల్చి చెప్పారు. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. నియోజకవర్గంలో యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే తన ఉద్దేశం అని తెలిపారు. కొడంగల్ ఎమ్మెల్యేగా నియోజకవర్గం అభివృద్ధి తన బాధ్యత అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. సొంత నియోజకవర్గ ప్రజలను నేనెందుకు ఇబ్బంది పెడతానని అన్నారు. కాలుష్యరహిత పరిశ్రమల్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.