CM Revanth Reddy| తెలంగాణలో ఇటీవల ప్రభుత్వ వసతి గృహాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని ఎన్నిసార్లు సూచించినా.. నాణ్యత లేని ఆహారం అందించడంపై మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల్ని కన్నబిడ్డల్లా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. తరచూ పాఠశాలలు, గురుకులాలను తనిఖీ చేయాలని తెలిపారు. అలాగే మాగనూర్ ఘటనలో బాధ్యులైన వారిపై వేటు వేసి సంబంధిత నివేదికలను సమర్పించాలని జిల్లా కలెక్టర్‌కు కీలక ఆదేశాలు జారీ చేశారు.
విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో పొరపాట్లు జరగకుండా చూడాలని పలుమార్లు ఆదేశాలిచ్చినా.. మళ్లీ అలాంటి ఘటనలే జరుగుతుండటంపై సీరియస్ అయ్యారు. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఉదాశీనంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులకు పరిశుభ్ర వాతావారణంలో మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో వేల సంఖ్యలో ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టామన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు డైట్ ఛార్జీలు పెంచామని చెప్పారు.ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాల్జేసేందుకు యత్నిస్తే బాధ్యులైన వారిపై కలెక్టర్లు వేటు వేయాలని ఆదేశాంచారు. వదంతులతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో భయాందోళనలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిని ఉద్యోగాల్లోంచి తొలగించేందుకు కూడా వెనుకాడబోమని రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.