Revanth Reddy: లగచర్ల ఘటన(Lagacharla Incident)లో జైలు జీవితం గుడుపుతున్న రైతు హీర్యానాయక్(Hiryanayak)కు గుండెనొప్పి రావడంతో పోలీసులు సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ సమయంలో రైతు చేతికి బేడీలు వేసి ఉండటంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులతో మాట్లాడిన ఆయన విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అలాగే హీర్యానాయక్‌కు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
కాగా రైతు హీర్యానాయక్‌కు జైలులో గుండెనొప్పి రావడంతో తొలుత సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించారు. అయితే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అంతకుముందు గుండెనొప్పి వచ్చిన రైతుకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకురావడం దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.