ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ సీఎం కొణిజేటి రోశయ్య (Konijeti Rosaiah) వల్లే తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్ లో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన రోశయ్య 3వ వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి సీఎం నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ట్రబుల్ షూటర్‌గా రోశయ్య కీలక పాత్ర పోషించబట్టే వైఎస్సార్ పని ఈజీ అయ్యేది అని కొనియాడారు.
రోశయ్య ఉన్నప్పుడు నెంబర్2 ఆయనే.. నెంబర్ 1 మాత్రమే మారేవారని రేవంత్ రెడ్డి అన్నారు. నెంబర్ 2లో ఉన్నా ఆయన ఎప్పుడూ తన పైన ఉన్నవారిని దాటిపోవాలని అనుకోలేదన్నారు. ఏరోజు కూడా నాకు ఈ పదవి కావాలని రోశయ్య అడగలేదని చెప్పారు. ముఖ్యమంత్రి స్థానం కోసం ఏ నాడు రోశయ్య తాపత్రయపడలేదన్నారు. పార్టీ పట్ల ఆయన నిబద్ధత కారణంగానే క్లిష్ట సమయంలో రోశయ్యను ముఖ్యమంత్రి చేయాలని సోనియా గాంధీ నిర్ణయించారని చెప్పారు. పార్టీ పట్ల నిబద్ధత, క్రమశిక్షణ వల్లనే ఆయనకు పదవులు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గుర్తు చేశారు.
Also Read : మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారు..!
తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రోశయ్య తన ఛాంబర్ కి పిలిపించుకుని విలువైన సూచనలు చేశారని సీఎం చెప్పారు. బాగా మాట్లాడుతున్నావు.. మరింత అధ్యయనం చేసి సభకు రావాలని సూచించారన్నారు. ప్రతిపక్షం తప్పక ప్రశ్నించాలి.. పాలకపక్షం ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పారన్నారు. ప్రజలకు మేలు కలిగేలా అధికార పక్షాన్ని నిలదీయాలని రోశయ్య తనకి హితబోధ చేశారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.
రోశయ్య విగ్రహం ఏర్పాటు చేస్తాం…
కొణిజేటి రోశయ్య (Konijeti Rosaiah) నిఖార్సైన హైదరాబాదీ అని సంపూర్ణంగా విశ్వసిస్తున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. ఆయన 50 ఏళ్ళ క్రితమే హైదరాబాద్ అమీర్పేట్ లో ఇల్లు కట్టుకున్నారని గుర్తు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు తనకి సమానమేనని రోశయ్య చెప్పేవారని రేవంత్ తెలిపారు. ఆయనకి హైదరాబాద్ లో విగ్రహం లేకపోవడం లోటు అని సీఎం అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రోశయ్య విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ఆర్యవైశ్య నేతలు మంచి ప్రాంతాన్ని ఎంపిక చేసి ప్రభుత్వానికి సూచిస్తే ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో విగ్రహ నిర్మాణం చేపడతామన్నారు. నాలుగో వర్ధంతి నాటికి దాన్ని పూర్తిచేస్తాం అని రేవంత్ వెల్లడించారు.