పాలమూరు బిడ్డనని చెప్పుకోవడం తనకెంతో గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలిపారు. నల్లమల ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రచిస్తామని చెప్పారు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘నల్లమల డిక్లరేషన్’ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. నల్లమల డిక్లరేషన్ ద్వారా గిరిజనుల సంక్షేమానికి రూ.12,600 కోట్లతో పనులు చేపడతామన్నారు. పాలమూరు వాసులకు పాలన చేతకాదన్నారు. ఇప్పుడు పన్నుల సేకరణలో కూడా తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందన్నారు.
“ఎవరో నాయకుడు వచ్చి నల్లమలను అభివృద్ధి చేయాలని అనేవారు. ఇప్పుడు నేను సీఎంగా నల్లమల నుంచి మాట్లాడుతుంటే నా గుండె ఉప్పొంగిపోతోంది. ఒకప్పుడు నల్లమల అంటే వెనుకబడిన ప్రాంతం. కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ఈ ప్రాంత రుణం తీర్చుకుంటున్నాం. నల్లమల ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రచించాలి. దేశంలో ఎన్నో ప్రాజెక్టులను పాలమూరు బిడ్డలు కట్టారు. పాలమూరు ప్రజలు కట్టిన ప్రాజెక్టులు నేడు దేశానికి వెన్నెముకగా ఉన్నాయి” అన్నారు.
ఇక పహల్గాం ఉగ్రదాడి ఘటన గురించి మాట్లాడుతూ.. ఈ ఘటన తర్వాత ప్రధాని అంటే ఇందిరాగాంధీలా ఉండాలనే చర్చ వచ్చింది. ఆమె గతంలో పాకిస్థాన్‌తో యుద్ధం చేసి ఆ దేశాన్ని రెండు ముక్కలు చేశారు. 50 ఏళ్ల తర్వాత ఇందిరాగాంధీ పేరు చెప్పుకొంటున్నాం. దేశానికి స్వేచ్ఛనిచ్చిందే కాంగ్రెస్. అందరికీ భూములు ఇచ్చి ఆత్మగౌరవం నింపాలన్నది మా పార్టీ నినాదం. ప్రతి ఆదివాసీ గుండెల్లో ఇందిరమ్మ ఉంటుంది’’ అని రేవంత్
వెల్లడించారు.