CM Revanth Reddy|ప్రపంచంతో పోటీ పడేలా న్యూయార్క్, టోక్యో తరహాలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నగరంలో మౌలిక వసతుల కల్పనకు రూ.7వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు పేర్కొన్నారు. ఎస్‌టీపీలు, ఫ్లైఓవర్లు, నాలాల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో రైజింగ్ వేడుకలు నిర్వహించారు. ఐమ్యాక్స్ సమీపంలోని హెచ్‌ఎండీఏ మైదానంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, తదితర నేతలు, అధికారలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పలు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు రూ.5827కోట్లతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రూ.150 కోట్లతో పలు సుందరీకరణ పనులు, రూ.3,500 కోట్లతో రహదారి అభివృద్ధి పనులనకు సీఎం శంకుస్థాపన చేశారు. సిటీలో వరదనీరు నిలవకుండా వర్షపు నీటి సంరక్షణ, వరద నీటిని నియంత్రించే పనులకు 17 కోట్ల అంచనాలతో చేపట్టే పనులను ప్రారంభించారు. అలాగే కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టబోయే 6 జంక్షన్ల అభివృద్ధి, 7 ఫ్లైఓవర్లు, అండర్ పాస్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు భద్రత కిట్లను అందించారు.
నగరంలో తాగునీటి సరఫరాకు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ వివిధ ప్రాంతాల్లో రూ.45 కోట్లతో చేపట్టిన 19 రిజర్వాయర్లను ప్రారంభించారు. హైదరాబాద్ రోడ్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అధ్వర్యంలో గ్రేటర్ సిటీలో రూ.1500 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేసే ప్యాకేజీతో పాటు గతంలో పెండింగ్‌లో ఉన్న పనులకు శంకుస్థాపన చేశారు. ఇక అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుసంధానంతో కొత్త ఆన్‌లైన్ బిల్డింగ్ అప్రూవల్, లేఅవుట్ అప్రూవల్ సాఫ్ట్‌వేర్‌ను లాంఛనంగా ప్రారంభించారు.