Saturday, June 1, 2024
HomeతెలంగాణCM Revanth Reddy: భూముల ధరలు సవరించండి

CM Revanth Reddy: భూముల ధరలు సవరించండి

రాష్ట్ర ఆదాయాన్ని పెంచుదాం

రాష్ట్ర ఆదాయం పెంచేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, పన్నుల ఎగవేత లేకుండా కఠిన చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరిగేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. అవసరమైన సంస్కరణలు చేపట్టాలని ఆదేశించారు. శాఖాపరమైన లొసుగులు లేకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని ఆదేశించారు.

- Advertisement -

రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్య పన్నులు, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, మైనింగ్ విభాగాల అధికారులతో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు సచివాలయంలో సమావేశమయ్యారు.

గత ఏడాది వచ్చిన ఆదాయం ఆశాజనకంగా లేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై ప్రతి నెలా ఆదాయ పెంపును సమీక్షించుకోవాలని అధికారులను అప్రమత్తం చేశారు. బడ్జెట్లో పొందుపరిచిన వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏ నెలకానెలా మంత్లీ టార్గెట్ ను నిర్దేశించుకొని రాబడి సాధించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రధానంగా రాష్ట్రానికి రాబడి తెచ్చిపెట్టే జీఎస్టీ ఎగవేత లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. జీఎస్టీ కలెక్షన్ పెంచేందుకు పక్కాగా ఫీల్డ్ ఇన్స్పెక్షన్, ఆడిటింగ్ జరగాలని సూచించారు. జీఎస్టీ ఎగవేతదారులు ఎంతటివారైనా ఉపేక్షించకుండా, నిక్కచ్చిగా పన్ను వసూలు చేయాలని ఆదేశించారు. వాణిజ్య శాఖలో ఇంతకాలం జరిగిన పొరపాట్లు పునరావృతం కావద్దని, జీఎస్టీ రిటర్న్ పేరిట వెలుగులోకి వస్తున్న అవినీతి అక్రమాలకు తావు లేకుండా వ్యవహరించాలని అధికారులను హెచ్చరించారు.

గత ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల సీజన్లో మద్యం అమ్మకాలు, విక్రయాలు ఎక్కువగా జరిగినా లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరగకపోవటానికి కారణాలను సీఎం ఆరా తీశారు. అక్రమంగా మద్యం రవాణా, పన్ను ఎగవేత లేకుండా కట్టుదిట్టంగా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో అన్ని చోట్ల భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయి. కానీ అదే స్థాయిలో రెవిన్యూ రాబడుల్లో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం పెరగలేదని ఈ సందర్భంగా చర్చ జరిగింది.

చాలా చోట్ల భూముల మార్కెట్ విలువకు, వాస్తవ క్రయ విక్రయాల రేట్లకు పొంతన లేకపోవటం ప్రధాన కారణమనే చర్చ జరిగింది. గత ప్రభుత్వం 2021లో భూముల విలువను, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచింది. ఇప్పటికీ చాలాచోట్ల భూముల మార్కెట్ విలువకు, క్రయ విక్రయ ధరలకు భారీ తేడా ఉంది. నిబంధనల ప్రకారం ఏడాదికోసారి భూముల మార్కెట్ విలువను సవరించాల్సి ఉంటుంది. ఈ ధరల సవరణకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

ఎక్కడెక్కడ, ఏయే ప్రాంతాల్లో ధరలను సవరించాలి, వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ప్లాట్లు, అపార్ట్మెంట్లు.. వేటికి ఎంత సవరించాలనేది శాస్త్రీయంగా నిర్ధారణ జరగాలని, రిజిస్ట్రేషన్ స్టాంపుల విభాగం నిబంధనలను పక్కాగా పాటించాలని సీఎం చెప్పారు. రాష్ట్ర రాబడి పెంపుతో పాటు స్థిరాస్థి, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా భూముల మార్కెట్ ధరల సవరణ జరగాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే స్టాంప్ డ్యూటీ ఎంత మేరకు ఉంది.. తగ్గించాలా.. పెంచాలా.. అనేది కూడా అధ్యయనం చేయాలని సూచించారు.

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉద్యోగుల కొరత లేకుండా సర్దుబాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే చాలాచోట్ల అద్దె భవనాల్లో ఉన్నాయని, రిజిస్ట్రేషన్లకు వచ్చే వాళ్లు ఇప్పటికే చెట్ల కింద నిలబడే ఉంటున్నారని చర్చకు వచ్చింది. పబ్లిక్ యుటిలిటీకి సేకరించిన స్థలాలను గుర్తించి కొన్నిచోట్ల అధునాతనంగా మోడల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు నిర్మించాలని, అందుకు సన్నాహాలు చేయాలని సీఎం చెప్పారు. సామాన్యులకు, చిన్న చిన్న నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇసుక ద్వారా వచ్చే ఆదాయం పెరగాలంటే అక్రమ రవాణాను, లీకేజీలను ఎక్కడికక్కడ అరికట్టాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News