CM Revanth Reddy| తెలంగాణ ప్రజా కవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు (Kaloji Narayana Rao) వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఘన నివాళి అర్పించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ‘నిజాం నిరంకుశత్వానికి, దొరల దమననీతికి వ్యతిరేకంగా కలం ఎత్తిన యోధుడు కాళోజీ.., పుట్టుక నీది – చావు నీది బతుకంతా దేశానిది…అని సేవకు స్ఫూర్తి నింపిన మహనీయుడు’ అని సీఎం కొనియాడారు.
ఇక మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్(KCR) సైతం కాళోజీకి నివాళి అర్పించారు. ‘తోటి మనిషి బాగు కోరుకోవడమే కాళోజీకి ఘన నివాళి. కవిగా తన కలాన్ని, గళాన్ని, జీవితాన్ని తెలంగాణ కోసం అర్పించారు. తెలంగాణ అస్తిత్వం, సాహిత్య గరిమను ప్రపంచానికి చాటారు. కాళోజీ స్ఫూర్తి భవిష్యత్ తరాలకు అందించడానికి కృషి చేశాం. తెలంగాణ సమాజం కోసం వారు పడిన తపన, వారు అందించిన పోరాట స్ఫూర్తి, మలిదశ ఉద్యమంలో అనంతరం బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఇమిడి ఉంది. ఈ మేరకు బీఆర్‌ఎస్ పలు కార్యక్రమాలను చేపట్టింది. తోటి మనిషి క్షేమాన్ని కోరుకోవడం, సబ్బండ వర్గాల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేయడం ద్వారానే వ్యక్తులుగా, ప్రభుత్వాలుగా కాళోజీకి మనం అందించే ఘన నివాళి’ అని చెప్పుకొచ్చారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) కూడా కాళోజీకి నివాళి అర్పించారు. ‘పుట్టుక నీది, చావు నీది…బ్రతుకంతా దేశానిది అనేంత గొప్పగా జీవించిన చైతన్య శీలి.. హక్కుల కోసం, తెలంగాణ భాష, సంస్కృతుల కోసం నియంత నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమించిన చలనశీలి… తెలంగాణ గొంతుకై నినదించిన ధీశాలి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు’.. అంటూ పోస్ట్ చేశారు.