Lack of common sense in public spaces : “కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా?”.. నలుగురిలో ఎవరైనా చేయకూడని పని చేస్తే మన నోటి నుంచి సహజంగా వచ్చే మాట ఇది. చదువు, సంస్కారం ఉన్నప్పటికీ కొందరి ప్రవర్తన చూస్తే అసలు ఈ ‘ఇంగితజ్ఞానం’ అనేదే మాయమైపోతోందా అనిపిస్తుంది. విచిత్రం ఏమిటంటే, ఈ ఇంగితజ్ఞానం ప్రాముఖ్యతను గుర్తుచేయడానికి ఏకంగా ఒక రోజును కేటాయించాల్సి వస్తోంది. ప్రతి ఏటా నవంబర్ 4న ‘ప్రపంచ కామన్ సెన్స్ డే’ జరుపుకుంటున్నామంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. అసలు మన ప్రవర్తనలో ఈ కనీస జ్ఞానం ఎందుకు లోపిస్తోంది? రోజూ మనం చూసే ఏయే సంఘటనలు ఇంగితజ్ఞానం లేమికి అద్దం పడుతున్నాయి?
రోడ్డంతా నాదే.. ఉమ్మేస్తా నా ఇష్టం : ఇటీవల మిర్యాలగూడలో జరిగిన ఓ చిన్న గొడవ ఇంగితజ్ఞానం లేమికి ప్రత్యక్ష ఉదాహరణ. ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న వ్యక్తి వెనక్కి చూడకుండా రోడ్డుపై ఉమ్మి వేయగా, అది గాలికి వెనుక వస్తున్న మరో వ్యక్తిపై పడింది. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది కేవలం ఒక్క సంఘటనే కాదు. పాన్‌లు, గుట్కాలు నములుతూ రోడ్లపై విచక్షణారహితంగా ఉమ్మి వేయడం, రోడ్డు మధ్యలో వాహనాలు నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం వంటివి నిత్యకృత్యమయ్యాయి. రోడ్డంతా తమ సొంత జాగీరు అన్నట్లు ప్రవర్తించడం చాలా మందికి అలవాటుగా మారింది.
పొగ తాగడం స్టేటస్ కాదు.. పరుల పాలిట శాపం : పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా, దాన్ని ఓ స్టేటస్ సింబల్‌గా భావించే యువత సంఖ్య పెరుగుతోంది. అయితే, వారు తమ ఆరోగ్యంతో పాటు పక్కనున్న వారి ఆరోగ్యాన్ని కూడా పాడుచేస్తున్నారన్న కనీస స్పృహ కోల్పోతున్నారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు ఉన్నారన్న ఇంగితం లేకుండా బహిరంగ ప్రదేశాల్లో, బస్టాండ్లలో సిగరెట్లు కాలుస్తూ పరోక్ష ధూమపానానికి కారణమవుతున్నారు. ఇది సాటి మనిషి స్వేచ్ఛను హరించడమేనన్న విషయాన్ని విస్మరిస్తున్నారు.
ప్రమాదం జరిగితే.. సాయం మరిచి సెల్ఫీలు ::చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు, లోకంతో సంబంధం తెగిపోతోంది. ముఖ్యంగా ఎక్కడైనా ప్రమాదం జరిగితే, బాధితులను కాపాడాలి, వెంటనే అంబులెన్స్‌కు, పోలీసులకు సమాచారం ఇవ్వాలి అన్న ఇంగితజ్ఞానాన్ని పక్కనపెట్టి, ఆ దృశ్యాలను తమ ఫోన్లలో బంధించడానికి ఎగబడుతున్నారు. క్షతగాత్రులు విలవిల్లాడుతుంటే, వారిని వీడియో తీస్తూ పైశాచిక ఆనందం పొందే వారి సంఖ్య పెరిగిపోవడం ఆందోళన కలిగించే పరిణామం.
ఉచిత సౌకర్యాలున్నా.. పాడుచేయడమే పనిగా : ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ బస్టాండ్లలో, రైల్వేస్టేషన్లలో ఉచిత మూత్రశాలలను ఏర్పాటు చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని ప్రధాన కేంద్రాల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ, కొందరు వాటిని ఉపయోగించుకోకుండా, బహిరంగ ప్రదేశాల్లోనే మూత్ర విసర్జన చేస్తూ పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్నారు. దీనివల్ల దుర్వాసన రావడమే కాకుండా, ప్రజల ఆరోగ్యానికి కూడా తీవ్ర హాని కలుగుతోంది. సౌకర్యాలు కల్పించినా వాటిని సద్వినియోగం చేసుకోకపోవడం ఇంగితజ్ఞానం లోపించడమే అవుతుంది. ఈ ‘కామన్ సెన్స్ డే’ రోజైనా ప్రతి ఒక్కరూ తమ ప్రవర్తన గురించి ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


