కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmaar Mallanna)పై రెడ్డి మహిళా సంఘం నేతలు డీజీపీ జితేందర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లన్నకుఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించామని.. ఈ సంగతి మర్చిపోకూడదన్నారు. మల్లన్న సీఎం అయినా, పీఎం అయినా తమకు అభ్యంతరం లేదని.. కానీ తమ కులాన్ని అవమానిస్తే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కూడా మల్లన్న వ్యాఖ్యలపై స్పందించాలని కోరారు. తక్షణమే మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రెడ్డి కులానికి మల్లన్న క్షమాపణలు చెప్పి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళణలు చేపడతామన్నారు.
కాగా మల్లన్న వ్యాఖ్యలపై ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మల్లన్న ఎమ్మెల్సీ గెలుపు కోసం తాము డబ్బులు ఖర్చు పెట్టుకుని పనిచేశామన్నారు. తాజాగా మల్లన్న తీరుపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందిచారు. మల్లన్న మాట్లాడిన మాటలు సరిగా లేవని పార్టీలో క్రమశిక్షణ అనేది చాలా అవసరమన్నారు. ఎవరైనా సరే క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా ఇటీవల జరిగిన బీసీ గర్జన సభలో తీన్మార్ మల్లన్న రెడ్డి సామాజిక వర్గం నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.