Conflict between BC leaders in BJP Office: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ సంఘం నేతల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. నేతల ఫొటోల విషయంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఆర్. కృష్ణయ్యతోపాటుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గొడవను అడ్డుకున్నా వారు శాంతించలేదు.
బీజేపీ ఆఫీస్‌లో బీసీల కుస్తీ: ఈ నెల 18న బీసీ జేఏసీ నిర్వహించ తలపెట్టిన బంద్‌కు మద్దతు ఇవ్వాలని బీజేపీని కోరేందుకు బుధవారం ఆర్. కృష్ణయ్యతో పాటు బీసీ సంఘాల నేతలు బీజేపీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావుతో కలిసి ప్రెస్‌మీట్ పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ సమయంలోనే బీసీ సంఘం నేతలు గుజ్జ కృష్ణ, గుజ్జ సత్యం మధ్య విభేదాలు బయటకొచ్చాయి. జూనియర్ అయి ఉండి ఫొటోలకు ఎలా ముందుకు వెళ్తావని ఒకరినొకరు తిట్టుకున్నారు. ఒకరిపై ఒకరు అరుచుకుంటూ చివరకు పరస్పరం దాడికి దిగారు. అంతేకాకుండా ఒకరిపై ఒకరు కుర్చీలు విసుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. కొట్లాటకు దిగిన నేతలపై మిగతా బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బట్టబయలైన అంతర్గత విబేధాలు: బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దాడికి దిగిన వాళ్లు ఎవరి వర్గానికి చెందిన వారు అనే చర్చ జరుగుతున్నది. రాష్ట్ర నాయకత్వాన్ని సీనియర్ నేతలు నేరుగా విమర్శిస్తున్న వారిపై చర్యలు లేవని అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. నేతల మధ్య సమన్వయం లేదని, ఆధిపత్యం కోసం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతున్నదంటున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో బీజేపీని అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ విమర్శిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే 9వ షెడ్యూల్‌లో బీసీ 42శాతం అంశం చేర్చాలని అంటున్నారు.
బీజేపీలో బీసీలు ఎక్కడ?: ఈ ఘటన ఇలా ఉండగానే.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దిల్లీ నుంచి వచ్చే ప్రముఖ నాయకులు తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పడం తప్ప.. ఎక్కడా ఆచరణలో చూపలేదన్నారు. కిషన్ రెడ్డిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘ఇదేమి రాజ్యం.. కిషన్ రాజ్యం’ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణలో ఎన్నికలు వస్తే బీసీలను మరిచిపోతారు. ఇప్పుడు బీజేపీలో బీసీలు ఎక్కడ ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారని అక్కడి ప్రజలు తమను అడుగుతున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమిటీపైనా గతంలో సైతం రాజాసింగ్ విమర్శలు చేశారు. ఈ కమిటీతో బీజేపీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తా అని సవాల్ విసిరారు. పార్టీని నాశనం చేస్తున్నదెవరో మరోసారి చెబుతానని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీసీ సంఘం నేతలపై తాగి దాడి చేసిన బీజేపీ గుండాలు!! pic.twitter.com/QaxQcdFDMD
— SR🚩 (@SrGoud29) October 15, 2025


