బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) తీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో కౌశిక్ రెడ్డి చేసిన హంగామాపై బీఆర్ఎస్ కీలక నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు స్పందించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనల పట్ల బీఆర్ఎస్ విధానం ఏంటో ప్రజలకు చెప్పాలన్నారు. ఇదేనా నేతలకు బీఆర్ఎస్ పార్టీ నేర్పే సంస్కృతి అని ప్రశ్నించారు. పార్టీల మార్పుపై జీవితాంతం ఒకే పార్టీలో ఉన్న వాళ్లు మాట్లాడితే బాగుంటుందన్నారు. పార్టీలు మారిన వాళ్లు కూడా ఇతరులను ప్రశ్నించడం చూస్తుంటే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు.
ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరమణా రావు(Viajayaramana Rao) మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి ఓ చిల్లర నేత అని మండిపడ్డారు. మీడియా దృష్టిలో పడేందుకే గొడవలకు ప్రయత్నించారని తెలిపారు. కౌశిక్ రెడ్డి సమావేశం మొదటి నుంచి గొడవ చేసే ప్రయత్నం చేశారని.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడేటప్పుడు కూడా ఇలాగే చేయబోరని చెప్పుకొచ్చారు. పార్టీ మార్పుపై ప్రశ్నించే హక్కు కౌశిక్ రెడ్డికి లేదని గుర్తుచేశారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వెళ్లిన వారేనని పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డిపై తప్పక చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.