నేటి ఆధునిక యుగంలో ప్రపంచీకరణ ప్రభావం వల్ల పల్లెల్లో గ్రామస్తులను చాలా మార్చేసింది. ప్రజలకు పశుపక్షాదులతో ఉన్న అనుబంధం కూడా క్రమంగా కనుమరుగు అవుతోంది. గతంలో పల్లెల్లో వ్యవసాయంతో పాటు దానికి అనుబంధంగా పశుపక్షాదుల పోషణ కూడా పెద్ద ఎత్తున సాగేది. పశువులు, కోళ్లు వంటివి అందరి గుమ్మాల ముందు ఉండేవి.
తొలి కోడి కూయగానే తెల్లవారింది లేరండోయ్ అని అందరూ తమ దైనందిన జీవితాలకు ఉపక్రమించేవారు. తొలి కోడి, రెండో కోడి ఇలా గ్రామీణులు కోళ్ల భాషను చక్కగా అర్థం చేసుకుని తమ వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకునేవారు. కానీ ఇప్పుడు ఆ కోడి కూత గగనమైపోతోంది.
ఇళ్ల దగ్గర నాటు కోళ్ల పెంపకం తగ్గిపోయి..అంతా బాయిలర్ కోళ్ల యుగం వచ్చేసింది. ఈ నాటు కోళ్ల పోషణ కూడా ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. మరోవైపు మార్కెట్లో మాత్రం నాటు కోడి ఉత్పత్తులకు విపరీతమైన గిరాకీ ఉంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదనే నెపంతో వీటికి మంచి ధర పలుకుతున్నా వీటి మెయిన్టెనెన్స్ తల ప్రాణం తోకకు వస్తోంది. దీంతో గ్రామాల్లో కొక్కురొక్కో అనే శబ్దాలు చాలా అరుదుగా వినిపిస్తున్నాయి.
- ఆందోల్ తెలుగుప్రభ ప్రతినిధి