ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షా ఇద్దరు కలిసి దేశాన్ని నాశనం చేస్తున్నారని, మోడీ హటావో దేశ్ కో బచావో కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య ఆరోపణ చేశారు. సిపిఐ ఇంటింటికి కార్యక్రమంలో భాగంగా మొయినాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని, ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందని ఆయన విమర్శించారు. మతతత్వ భావజాలాన్ని పెంచుతూ దళిత గిరిజన వెనకబడిన కులాల మీద దాడులకు దౌర్జన్యాలకు ఉసిగొల్పుతున్నదని, మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం ద్వారానే లబ్ధి పొందాలని కపట నీతిని ప్రదర్శించడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. మనువాద రాజ్యాంగాన్ని అమలు చేసే కుట్రలకు పాల్పడుతున్నదని ఇదే జరిగితే మహిళలకు, దళిత గిరిజన వెనుకబడిన కులాలకు అన్యాయం జరుగుతుందని అందుకోసమే బిజెపిని గద్దె దించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలు, సిపిఐ చేవెళ్ల నియోజకవర్గం కన్వీనర్ కే రామస్వామి కో కన్వీనర్ ప్రభులింగం నాలుగు మండలాల కార్యదర్శులు కే శ్రీనివాస్, సత్తిరెడ్డి సుధీర్, ఎన్ జంగయ్య, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ ఏఐకేఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సుధాకర్ గౌడ్, బికేఎంయు జిల్లా అధ్యక్షుడు జే అంజయ్య, మహిళా సంఘం నాయకురాలు మాధవి, మంజుల ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు బి ప్రభాకర్, శివ ఏఐవైఎఫ్ మండల అధ్యక్షుడు శ్యాంసుందర్, ఏఐకేఎస్ మండల అధ్యక్షుడు కే రాములు, అర్జున్ రావు, నరేందర్, సత్తయ్య గౌడ్, ఏఐవైఎఫ్ ఉపాధ్యక్షుడు ఎండి జలీల్, వెంకటయ్య, గణేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.