Crimes against children : కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నవారే కాలయములవుతున్నారు. ఆప్యాయంగా అక్కున చేర్చుకోవాల్సిన ఆత్మీయులే అంతమొందిస్తున్నారు. భార్యాభర్తల మధ్య విభేదాలు, ఆస్తి కోసం అన్నదమ్ముల గొడవలు, అనైతిక సంబంధాల పాపాలు.. కారణం ఏదైనా బలైపోతోంది మాత్రం అభంశుభం తెలియని పసిమొగ్గలే. పెద్దలపై పెంచుకున్న పగను, కోపాన్ని చిన్నారులపై ప్రదర్శిస్తూ రాక్షసానందం పొందుతున్నారు. ఇటీవలి కాలంలో హైదరాబాద్ మహానగరంలో వెలుగుచూస్తున్న వరుస ఘటనలు తీవ్రంగా కలిచివేస్తున్నాయి. అసలు కన్నవారే కసాయిలుగా ఎందుకు మారుతున్నారు..? బంధువులే బలిపీఠం ఎందుకు ఎక్కిస్తున్నారు..? ఈ ఘోరాల వెనుక ఉన్న కారణాలేంటి..?
హైదరాబాద్‌లో హడలెత్తిస్తున్న ఘటనలు
కన్నతండ్రే కాలయముడు: హైదరాబాద్ బండ్లగూడలో ఓ తండ్రి రాక్షసత్వం పరాకాష్టకు చేరింది. అనారోగ్యంతో బాధపడుతున్న కొడుక్కి వైద్యం చేయించడం భారంగా భావించిన ఆ కర్కోటకుడు, బిడ్డ గొంతు నులిమి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని మూసీ నదిలో పడేసి, ఏమీ ఎరగనట్లు తన కొడుకు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి నానా హంగామా చేశాడు. పోలీసులకు అనుమానం వచ్చి లోతుగా విచారించగా, అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు.
పగతో పసిప్రాణం బలి: యాకత్‌పురాలో జరిగిన ఘటన మానవత్వానికే మాయని మచ్చ. కొద్దిరోజుల క్రితం చనిపోయిన తన కుమార్తె మరణానికి అక్కే కారణమని పగ పెంచుకున్న తమ్ముడు, ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. అక్కపై ఉన్న కోపంతో ఆమె ఏడేళ్ల కుమార్తెను ఆడుకుందామని నమ్మించి, భార్యతో కలిసి ఆ చిన్నారి కాళ్లు, చేతులు కట్టేసి బతికుండగానే నీళ్ల ట్యాంకులో పడేశాడు. ఆ పసి ప్రాణం కాపాడమని ఎంత వేడుకున్నా వారి గుండె కరగలేదు. అనంతరం ఏమీ తెలియనట్లు నాటకమాడినా, పోలీసుల దర్యాప్తులో వారి దారుణం బట్టబయలైంది.
బాబాయ్ నీచం.. బాలిక ఆత్మహత్య: పేట్ బషీరాబాద్‌లో సొంత బాబాయే ఓ బాలిక పాలిట యముడయ్యాడు. వ్యాపారం కోసం తీసుకున్న అప్పు తీర్చలేదన్న అక్కసుతో, తమ్ముడి కుమార్తె స్నానం చేస్తుండగా వీడియోలు తీశాడు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించడంతో, అవమాన భారం తట్టుకోలేక ఆ బాలిక బలవన్మరణానికి పాల్పడింది. అండగా ఉండాల్సిన వాడే అఘాయిత్యానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది.
భార్యపై కోపం.. పిల్లలే సమిధలు: భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ముగ్గురు చిన్నారుల ప్రాణాలను బలిగొన్నాయి. భార్యపై కోపంతో ఏపీకి చెందిన ఓ వ్యక్తి, నాగర్‌కర్నూలు జిల్లాలో తన ముగ్గురు పిల్లలను పెట్రోల్ పోసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కన్నతండ్రే కదా అని నమ్మి బైక్‌పై వెళ్లిన ఆ చిన్నారుల జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోయాయి.
పెరుగుతున్న నేర ప్రవృత్తి : మానసిక నిపుణురాలు మంజుల మాట్లాడుతూ, “చిన్న పిల్లలపై నేరాలు, అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పెద్దవారు తమ కోపాన్ని, అసహనాన్ని బలహీనులైన పిల్లలపై చూపిస్తున్నారు. కుటుంబం, పాఠశాల వంటి ప్రదేశాల్లో చిన్నారుల చుట్టూ ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం అత్యవసరం” అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం, 2023లో తెలంగాణలో 1,257 మంది చిన్నారులపై దాడులు జరిగాయి. చిన్నారులపై లైంగిక దాడులు ఏటా 70 నుంచి 80 శాతం పెరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఆర్థిక వివాదాలు, కుటుంబ తగాదాలు, వివాహేతర సంబంధాల వంటి కారణాలతో ఏ పాపం తెలియని పసి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.


