Cyber criminals impersonating army officers to scam people : “నేను ఆర్మీ ఆఫీసర్‌ను, హైదరాబాద్‌కు ట్రాన్స్‌ఫర్ మీద వచ్చాను, ఇక్కడ అద్దెకు ఇల్లు చూస్తున్నాను.” అని ఎవరైనా చెప్పగానే, “అయ్యో, సైన్యంలో పనిచేసేవారా! చాలా మంచివారు, దేశానికి సేవ చేసేవారు” అని వెంటనే ఒక నమ్మకం ఏర్పడుతుంది. వాట్సాప్‌లో యూనిఫాంలో ఉన్న ఫోటో కూడా పంపిస్తే, ఇక అనుమానించడానికి ఏముంది అనుకుంటాం. కానీ, ఇదే నమ్మకాన్ని ఆయుధంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మనల్ని నిలువునా ముంచేస్తున్నారు.
సైనికుడి వేషం.. రూ.12.75 లక్షలు గోవిందా : ఈ మోసానికి ప్రత్యక్ష ఉదాహరణ, ఇటీవలే హైదరాబాద్, ఖైరతాబాద్‌లో జరిగిన ఘటన.
అద్దెకు ఇల్లు: ఓ ఇంటి యజమాని, తన ఇల్లు అద్దెకు ఉందని ‘మ్యాజిక్ బ్రిక్స్’ వెబ్‌సైట్‌లో ప్రకటన ఇచ్చారు.
“నేను NSG కమాండోని”: వెంటనే, ఆశిష్ కుమార్ పహార్ అనే వ్యక్తి ఫోన్ చేసి, తాను NSG కమాండోనని, వెస్ట్ బెంగాల్ నుంచి హైదరాబాద్‌కు బదిలీ అయిందని చెప్పాడు. నమ్మకం కోసం, NSG యూనిఫాంలో ఉన్న ఫోటోలను కూడా పంపాడు.
“అధికారి” ఎంట్రీ: ఇల్లు అద్దెకు ఇవ్వడానికి యజమాని ఒప్పుకున్న వెంటనే, మరో వ్యక్తి ఫోన్ చేసి, తాను NSG ఉన్నతాధికారినని పరిచయం చేసుకున్నాడు. భద్రతా కారణాల దృష్ట్యా (పుల్వామా దాడి తర్వాత), తమ కమాండోకు ఇల్లు అద్దెకు ఇచ్చే యజమాని బ్యాంకు ఖాతా వివరాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని నమ్మబలికాడు.
దోపిడీ పర్వం: “మీ ఖాతా వివరాలు సరిచూడటానికి కొంత డబ్బు పంపాలి” అని చెప్పి, తన ఖాతా వివరాలు ఇచ్చాడు. ‘ఖాతా వివరాలు తేడా రాకూడదు, మీ పేరు మ్యాచ్ అవ్వట్లేదు’ అంటూ పలుమార్లు సాకులు చెప్పి, మూడు రోజుల్లో ఆ యజమాని వద్ద నుంచి విడతల వారీగా ఏకంగా రూ.12 లక్షల 75 వేలు కాజేశాడు. చివరకు మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
పురాతన నాణేల పేరిట.. వృద్ధుడికి టోకరా : మరో ఘటనలో, ఫేస్‌బుక్‌లో “పురాతన నాణేలను అధిక ధరకు అమ్ముకోవచ్చు” అనే ప్రకటన చూసి ఓ 74 ఏళ్ల వృద్ధుడు ఆశపడ్డాడు. ఆ లింక్‌ను క్లిక్ చేసి, తన వివరాలు నమోదు చేయగానే, మనోజ్ కుమార్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు.
రూ.72 లక్షల ఆశ: వృద్ధుడి వద్ద ఉన్న నాణేలకు రూ.72 లక్షల విలువ ఉందని నమ్మించాడు.
వివిధ ఫీజుల వసూలు: అయితే, ఈ డీల్ పూర్తికావాలంటే ఆర్బీఐ క్లియరెన్స్, ట్రావెల్, కొరియర్ ఫీజుల కింద డబ్బులు పంపాలని చెప్పాడు. దీనిని నమ్మిన బాధితుడు, విడతల వారీగా రూ.4 లక్షల 27 వేలు పంపాడు. ఇంకా డబ్బులు అడుగుతుండటంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల హెచ్చరిక.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి : ఈ తరహా మోసాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
యూనిఫాం చూసి నమ్మొద్దు: వాట్సాప్‌లో పంపే యూనిఫాం ఫోటోలు, ఐడీ కార్డులు, డాక్యుమెంట్లు నకిలీవి కావచ్చు. వాటిని గుడ్డిగా నమ్మవద్దు.
ముందుగా డబ్బులు పంపొద్దు: అద్దె లేదా అడ్వాన్స్ పేరుతో ఎప్పుడూ ముందుగా డబ్బులు పంపవద్దు.
ఫీజుల పేరిట మోసం: రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్, ఆర్బీఐ ఎన్ఓసీ, జీఎస్టీ, కొరియర్ ఫీజుల పేరుతో డబ్బులు అడిగితే అది కచ్చితంగా మోసమే.
వ్యక్తిగత వివరాలు వద్దు: తెలియని వ్యక్తులకు మీ ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పవద్దు. అపరిచిత వ్యక్తులు చెప్పే తియ్యని మాటలకు ఆశపడి, కష్టార్జితాన్ని కోల్పోవద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదైనా అనుమానం వస్తే, వెంటనే 1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు


