Child online safety tips : అమ్మ చేతి గోరుముద్దల కన్నా సెల్‌ఫోన్ వీడియోగాలే పిల్లలకు ప్రీతిపాత్రమవుతున్నాయి. మైదానంలో ఆడే ఆటల కన్నా ఆన్‌లైన్ గేములే వారికి ఆనందాన్నిస్తున్నాయి. కరోనా తర్వాత చదువుల నుంచి ఆటల వరకు ప్రతీది అరచేతిలో ఇమిడిపోవడంతో చిన్నారుల ప్రపంచం స్మార్ట్‌ఫోన్ చుట్టూనే తిరుగుతోంది. అయితే, పసిపిల్లల అమాయకత్వాన్నే ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. చిన్నారులనే లక్ష్యంగా చేసుకుని అదనుచూసి దెబ్బకొడుతున్నారు. అసలు పిల్లల్ని సైబర్ నేరగాళ్లు ఎలా వలలో వేసుకుంటున్నారు? తల్లిదండ్రులు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఎంత నష్టం వాటిల్లుతుంది..? ఈ సైబర్ సుడిగుండం నుంచి పిల్లలను కాపాడుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?
ఎర వేసేదిలా.. పసిమనసులే లక్ష్యంగా : కరోనా పుణ్యమా అని ఆన్‌లైన్ విద్య అనివార్యం కావడంతో చిన్నారులకు సెల్‌ఫోన్లు దగ్గరయ్యాయి. ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు తమ చేతివాటానికి పదునుపెట్టారు. ముఖ్యంగా ఆన్‌లైన్ గేములు, రీల్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చురుగ్గా ఉండే పిల్లలే వీరి ప్రధాన లక్ష్యం.
ఆకర్షణీయమైన లింకులు: ఆన్‌లైన్ గేముల్లో తర్వాతి స్థాయికి వెళ్లడానికనో, కొత్త ఫీచర్లు వస్తాయనో ఆశ చూపి కొన్ని మోసపూరిత లింకులను పంపుతారు.
తెలియని సూచనలు: ఆ లింకులను వేరే డివైజ్‌లలో తెరవాలని, లేదంటే కొన్ని యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచిస్తారు.
అమాయకత్వమే ఆయుధం: సాంకేతికతపై పూర్తి అవగాహన లేని చిన్నారులు వాటిని గుడ్డిగా నమ్మి క్లిక్ చేస్తారు. ఆ క్షణంలోనే వారి ఫోన్ సైబర్ నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్లిపోతుంది.
కళ్లుమూసి తెరిచేలోగా.. ఖాతా ఖాళీ : పిల్లలు పొరపాటున ఆ లింకులను క్లిక్ చేసిన వెంటనే, ఫోన్‌కు అనుసంధానమైన తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల వివరాలు నేరగాళ్ల చేతికి చిక్కుతాయి. కళ్లుమూసి తెరిచేలోగా ఖాతాలోని డబ్బు మాయమవుతుంది. సైబర్ నేరాల బారిన పడుతున్నది కేవలం సామాన్యులే కాదు, సెలబ్రిటీల నుంచి టెక్నాలజీ నిపుణుల వరకు అందరూ ఉంటున్నారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సైతం తన కుమార్తె ఆన్‌లైన్ కార్యకలాపాల గురించి బహిరంగంగా ఆందోళన వ్యక్తం చేశారు. మంచిర్యాలకు చెందిన ఓ ఐటీ నిపుణుడు సైతం ఆన్‌లైన్ మోసగాళ్ల చేతిలో రూ.4.50 లక్షలు పోగొట్టుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
పోలీసుల సూచనలు : చిన్నారులను సైబర్ నేరగాళ్ల నుంచి కాపాడుకోవడానికి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ కింది జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు. పిల్లలు వాడే మొబైల్ ఫోన్లలో బ్యాంకు ఖాతాలు, వ్యక్తిగత, సున్నితమైన సమాచారాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉంచవద్దు.
ఫోన్‌కు వచ్చే ఓటీపీ (OTP)లను ఎవరితోనూ పంచుకోకుండా పిల్లలకు అవగాహన కల్పించాలి.
పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లను ఉపయోగించి ఆర్థిక లావాదేవీలు జరపడం అత్యంత ప్రమాదకరం.
ఏటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డుల పాస్‌వర్డ్‌లను ఫోన్లలో సేవ్ చేయకూడదు.
ఒకవేళ మోసపోయారని గ్రహించిన వెంటనే, ఆలస్యం చేయకుండా జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు కాల్ చేయాలి. దీనివల్ల నేరగాళ్ల ఖాతాలను తక్షణం ఫ్రీజ్ చేసి, డబ్బును వెనక్కి రాబట్టే అవకాశం ఉంటుంది.
గణాంకాలు చెబుతున్న వాస్తవాలు : ఒక్క మంచిర్యాల జిల్లాలోనే ఈ ఏడాది సెప్టెంబర్ వరకు 95 సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా, బాధితులు సుమారు రూ.95.50 లక్షలు నష్టపోయారు. అయితే, 1930 హెల్ప్‌లైన్‌కు సకాలంలో ఫిర్యాదు చేయడం వల్ల పోలీసులు రూ.20.30 లక్షలను వెనక్కి రాబట్టగలిగారు. ఇది సత్వర స్పందన ప్రాముఖ్యతను తెలియజేస్తోంది.


