Telangana road infrastructure damage : మొంథా తుపాను మిగిల్చిన గాయం పైకి కనిపించే దానికంటే చాలా లోతైనది. కుండపోత వర్షానికి రాష్ట్రంలోని రహదారులు జల్లెడయ్యాయి. వందల కిలోమీటర్ల మేర రోడ్లు తెగిపోయి, పదుల సంఖ్యలో గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కేవలం కంటికి కనిపించే నష్టమే కాదు, గత పదేళ్ల వర్షపాత రికార్డులను సైతం ఈ కుంభవృష్టి తుడిచిపెట్టేసింది.
అంకెల అద్దంలో విధ్వంసం : ‘మొంథా’ తుపాను సృష్టించిన బీభత్సంపై రోడ్లు, భవనాల (ఆర్ అండ్ బీ) శాఖ ప్రాథమికంగా నష్టాన్ని అంచనా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా 14 జిల్లాలపై దీని ప్రభావం స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా నాగర్‌కర్నూల్, సిద్దిపేట, హనుమకొండ, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో నష్టం తీవ్రంగా ఉంది.
మొత్తం దెబ్బతిన్న రోడ్లు: 334 ప్రాంతాల్లో 230.41 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమయ్యాయి.
నీట మునిగినవి: 201 రహదారులపై వరద నీరు పొంగిపొర్లింది. 8 ప్రధాన రోడ్లకు పగుళ్లు వచ్చాయి.
రాకపోకల బంద్: 156 ప్రాంతాల్లో పూర్తిగా రాకపోకలు నిలిచిపోగా, కొన్ని చోట్ల అధికారులు పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.
కల్వర్టుల నష్టం: 61 చోట్ల కల్వర్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నష్టానికి సంబంధించి తాత్కాలిక మరమ్మతులకే రూ.6.96 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. అయితే, దెబ్బతిన్న రోడ్లను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలంటే ఏకంగా రూ.225.75 కోట్లు అవసరమని నివేదికలో పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం లత్తీపూర్ వద్ద హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారి కోతకు గురవడంతో వాహనాలను డిండి, చింతపల్లి మీదుగా మళ్లించాల్సి వచ్చింది.
గ్రామాలకు తెగిన బంధం : పట్టణాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. పంచాయతీరాజ్ శాఖ అంచనాల ప్రకారం గ్రామీణ రోడ్లు భారీ ఎత్తున దెబ్బతిన్నాయి.
923 రోడ్లకు గండ్లు పడగా, 212 రోడ్లు పూర్తిగా తెగిపోయాయి.
312 కాజ్‌వేలు, కల్వర్టులు ధ్వంసమయ్యాయి.
270 గ్రామాల్లో రోడ్లు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి.
136 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఇంజినీరింగ్ అధికారులు నష్టంపై నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్, సూర్యాపేట జిల్లాల్లో తాత్కాలిక పనులకు రూ.10 కోట్లు కావాలని ప్రతిపాదనలు పంపారు.
దశాబ్దపు రికార్డు బద్దలు : ‘మొంథా’ తుపాను అక్టోబరు నెల వర్షపాత రికార్డులన్నింటినీ తిరగరాసింది. గత పదేళ్లలో అక్టోబరు నెలలో నమోదైన అత్యధిక వర్షపాతం రికార్డు తాజాగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో 42.2 సెంటీమీటర్లుగా నమోదైంది. గతంలో 2020 అక్టోబరు 19న హైదరాబాద్‌లో 19.1 సెం.మీ. వర్షపాతమే రికార్డుగా ఉండేది. ఈ నెల 29, 30 తేదీల్లో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో 20 నుంచి 42 సెం.మీ.ల మధ్య వర్షం కురవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే, మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో సాధారణ వర్షాలే కురుస్తాయని వాతావరణ శాఖ తెలపడం కాస్త ఊరటనిచ్చే అంశం. మరోవైపు, తుపాను కారణంగా నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు గురువారం నుంచి సాధారణ స్థితికి చేరుకున్నాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ తెలిపారు.


