బీఆర్ఎస్ తోనే దేశంలో మార్పు సాధ్యమని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని వసంత్ విహార్‌లో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన సందర్భంగా జీవన్ రెడ్డి కేసీఆర్ కి, మంత్రి కేటీఆర్ కి శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లోని మొదటి అంతస్తులోని తన ఛాంబర్ లో ఆశీనులైన ముఖ్యమంత్రి కేసీఆర్ కి పుష్పగుచ్ఛం అందించి తన సంతోషం వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి ఆయనకు పాదాభివందనం చేసి తన అభిమానం చాటుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆప్యాయంగా జీవన్ రెడ్డి భుజం తట్టి ఆశీస్సులు అందజేశారు. అలాగే తన చాంబర్ లో ఆసీనులైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి కూడా పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన జీవన్ రెడ్డి ని మంత్రి కేటీఆర్ ఆలింగనం చేసుకున్నారు. ఆ తరువాత జీవన్ రెడ్డి మాట్లాడుతూ విజనరీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం కావాలన్నదే అంతిమంగా ప్రజాభిమతమన్నారు.
కార్పొరేట్ శక్తుల కొమ్ము కాస్తూ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న ప్రధాని మోడీకి ఇక మూడిందని, కేసీఆర్ నాయకత్వంలోఆట మొదలైందని, ఇక నుంచి బీజేపీకి ఓటమే మిగులుతుందని ఆయన అన్నారు.
అభివృద్ధి, సంక్షేమానికి సరైన నిర్వచనంగా నిలిచిన తెలంగాణ మోడల్ కే దేశ ప్రజలు జైకొడుతున్నారని ఆయన చెప్పారు. అరచేతిలో స్వర్గం చూపిస్తూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్న మోడీ గోల్ మాల్ మోడల్ ఖతం అయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని జీవన్ రెడ్డి హెచ్చరించారు. వాట్సాప్ యూనివర్సిటీలో అబద్దాలు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్న బీజేపీ నిజస్వరూపం ప్రజలకు తెలిసింది. బీజేపీకి వ్యక్తిగత ఆరోపణలు చేయడం తప్ప ఏదీ చేతకాదు. బీజేపీ అబద్దాలు మాట్లాడి ఎన్ని రోజులు బతుకుతుంది?. కర్ణాటకలో బీజేపీ చిత్తుగా ఓడిపోవడం ఖాయం. మహారాష్ట్ర లో కూడా అదే గతి పడుతుంది. ఈడీ, ఐటీ, సీబీఐ వంటి విచారణ సంస్థలను అడ్డుపెట్టుకొని రాజకీయ ప్రత్యర్థులను వేధించడమే పనిగా పెట్టుకున్న బీజేపీకి దేశ ప్రజలు శిక్ష విధించడం ఖాయం. తెలంగాణలో బీజేపీ నేతలు తప్ప ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. బీజేపీ అబద్దాలు మోసాలను ప్రతి ఊరిలో ఎండగడుతాం” అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.