Sunday, November 16, 2025
HomeతెలంగాణDengue Prevention : డెంగీ పడగ.. జ్వరమొస్తే జర భద్రం! ప్రాణాలతో చెలగాటమాడుతున్న నాలుగు రకాలు!

Dengue Prevention : డెంగీ పడగ.. జ్వరమొస్తే జర భద్రం! ప్రాణాలతో చెలగాటమాడుతున్న నాలుగు రకాలు!

Dengue fever outbreak in Hyderabad :  నగరంలో దోమల మోత మోగుతోంది, డెంగీ జ్వరాల హోరు పెరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే 500కు పైగా కేసులు నమోదవడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. మామూలు జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. డెంగీలో ఉన్న ఆ నాలుగు ప్రమాదకర రకాలేంటి? ఏ లక్షణాలు కనిపిస్తే యమ డేంజర్? ప్లేట్‌లెట్స్ పడిపోవడం కన్నా ప్రమాదకరమైన అసలు ముప్పు ఏమిటి?

- Advertisement -

సాధారణ జ్వరం అనుకుంటే.. ప్రాణాలకే ప్రమాదం : డెంగీ జ్వరం వచ్చిన 90 శాతం మందిలో ఎలాంటి తీవ్రమైన ఇబ్బందులు ఉండవని, అయితే మిగిలిన 10 శాతం మందిలో మాత్రం పరిస్థితి విషమించే అవకాశం ఉందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. డెంగీ వైరస్‌లో సిరో టైప్-1, 2, 3, 4 అని నాలుగు రకాలుంటాయి. గతంలో ఒక రకం (ఉదా: టైప్-1) డెంగీ వచ్చి తగ్గిన వ్యక్తికి, మళ్లీ మరో రకం (ఉదా: టైప్-2) వైరస్ సోకినప్పుడు అది ‘డెంగీ హెమరేజిక్ ఫీవర్‌’గా మారే ప్రమాదం ఎక్కువ.

ఇటీవల నగరంలో జరిగిన రెండు సంఘటనలు దీని తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ఓ వ్యక్తి ఐదారు రోజులు జ్వరంతో బాధపడి, జ్వరం తగ్గగానే పల్స్, బీపీ పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వైద్యులు అతనికి డెంగీ హెమరేజిక్ ఫీవర్‌గా నిర్ధారించారు. మరో ఘటనలో, డెంగీ సోకిన ఓ బాలింత ఆరోగ్యం క్షీణించి, చికిత్స పొందుతూ కార్పొరేట్ ఆసుపత్రిలో కన్నుమూసింది.

అసలు విలన్ ప్లేట్‌లెట్స్ కాదు.. ప్లాస్మా లీకేజీ : డెంగీ అనగానే అందరూ ప్లేట్‌లెట్స్ పడిపోవడం గురించే భయపడతారు. కానీ, దానికంటే అత్యంత ప్రమాదకరమైనది ‘ప్లాస్మా లీకేజీ’ అని వైద్యులు నొక్కి చెబుతున్నారు.

డెంగీ హెమరేజిక్ ఫీవర్: ఈ దశలో ప్లేట్‌లెట్లు 10-20 వేలకు పడిపోతాయి. ఫలితంగా చిగుళ్ల నుంచి, మూత్రంలో రక్తం రావడం, శరీరంపై దద్దుర్లు, మలం నల్లగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ప్లాస్మా లీకేజీ (డెంగీ షాక్ సిండ్రోమ్): ఇది అత్యంత ప్రమాదకరమైన దశ. రక్తనాళాల నుంచి ద్రవపదార్థం (ప్లాస్మా) బయటకు కారిపోవడం వల్ల రక్తం చిక్కబడిపోతుంది. దీనివల్ల రక్తప్రసరణ తగ్గి మెదడు, కాలేయం, కిడ్నీలు వంటి కీలక అవయవాలు పనిచేయడం మానేస్తాయి.

వైద్య నిపుణులు ఏమంటున్నారు : “తీవ్రమైన కడుపునొప్పి, ఆగకుండా వాంతులు, శరీర భాగాల నుంచి రక్తస్రావం, పల్స్-బీపీ పడిపోవడం, కాళ్లు-చేతులు చల్లబడటం, కళ్ల కింద వాపు వంటి లక్షణాలు కనిపిస్తే అది ‘డెంగీ షాక్ సిండ్రోమ్‌’కు సంకేతం. బాధితులు అపస్మారక స్థితికి చేరుకుంటారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించాలి,” అని ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజారావు హెచ్చరించారు.

ఈ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం
ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరం, కళ్ల వెనుక నొప్పి.
తీవ్రమైన ఒళ్లు, కీళ్ల నొప్పులు.
వాంతులు, వికారం.
తీవ్రమైన కడుపునొప్పి, ఆయాసం.
చిగుళ్లు, ముక్కు నుంచి రక్తస్రావం.
చర్మంపై ఎర్రటి మచ్చలు.
రక్తపోటు పడిపోవడం, అపస్మారక స్థితి.

నివారణే శ్రీరామరక్ష: డెంగీకి కారణమయ్యే ఏడిస్ ఈజిప్టి దోమ పగటిపూట చురుగ్గా ఉంటుంది. కాబట్టి ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పగటిపూట నిద్రించేటప్పుడు కూడా దోమతెరలు వాడటం, కిటికీలకు మెష్ బిగించుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ మహమ్మారి బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad