Bonalu in hyderabad: తెలంగాణ జీవన శైలికి అద్దం పట్టే ఆషాఢ మాసం బోనాలు, ప్రాంతాల వారీగా ప్రత్యేకతను సంతరించుకుంటాయి. గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయంలో తొలి బోనం సమర్పించిన తర్వాత, సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జరిగే లష్కర్ బోనాలకు (Lashkar Bonalu) అంతే ప్రాధాన్యత ఉంటుంది. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆచారాలు, సంప్రదాయాలు కాలగమనంలో కనుమరుగు అవుతున్నప్పటికీ, బోనాల ఉత్సవం మాత్రం తెలంగాణలో తరతరాలుగా కొనసాగుతూ వస్తోంది. ముఖ్యంగా మహిళల భాగస్వామ్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే ఈ పండుగ, తెలంగాణ ఆత్మకు ప్రతీకగా నిలుస్తుంది.
లష్కర్ బోనాల వెనుక కథనం:
లష్కర్ బోనాల చరిత్రను పరిశీలిస్తే, ఇది కేవలం మతపరమైన ఆచారం మాత్రమే కాదు, సామాజిక చరిత్రతో ముడిపడి ఉన్న ఒక ముఖ్యమైన సంఘటన. చారిత్రక కథనాల ప్రకారం, దక్కన్ ప్రాంతంలో బోనాల పండుగ గోల్కొండను పాలించిన అబుల్ హాసన్ కాలంలోనే ప్రారంభమైందని తెలుస్తోంది. అయితే, లష్కర్ బోనాల ప్రత్యేకత దాని జానపద గాథలు మరియు నిర్దిష్ట చారిత్రక సంఘటనలతో ముడిపడి ఉంది.
జానపద నమ్మకాలు:
జానపద పురాణాల ప్రకారం, పరాశక్తి (అమ్మవారు)కి రుద్రుడు (శివుడు)కి మధ్య వివాదాలు చోటు చేసుకుంటాయి. ఆ కోపంతో అమ్మవారు ఆషాఢ మాసంలో పుట్టింటికి వచ్చినట్లు, అదే సమయంలో ఆమెకు తోడుగా సప్తమాతృకలు (గ్రామ దేవతలు) మరియు సోదరుడు పోతరాజు (Pothuraju) ఆవిర్భవించినట్లు కథలు ప్రచారంలో ఉన్నాయి.
కలరా మహమ్మారి, ఉజ్జయిని మహంకాళి:
లష్కర్ బోనాల ప్రారంభానికి ముఖ్యమైన కారణం 19వ శతాబ్దంలో జరిగిన ఒక సంఘటన. 1813 ప్రాంతంలో హైదరాబాద్, సికింద్రాబాద్ లలో కలరా మహమ్మారి విలయతాండవం చేసింది. అప్పట్లో సికింద్రాబాద్‌లోని బ్రిటిష్ మరియు నిజాం సైనికులు కలరా నుండి రక్షణ కోరుతూ ఉజ్జయినిలోని మహంకాళి దేవతను ప్రార్థించారు. అమ్మవారి ఆశీస్సుల వలన మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో, సైనికులు అమ్మవారికి కృతజ్ఞతలు తెలియజేయాలని నిశ్చయించుకున్నారు.
ఉజ్జయిని మహంకాళి ఆలయ స్థాపన:
1815లో సికింద్రాబాద్‌కు తిరిగి వచ్చిన సైనికులు, ఉజ్జయినిలో తాము దర్శించిన మహంకాళి అమ్మవారి ప్రతిరూపాన్ని సికింద్రాబాద్‌లో ప్రతిష్టించాలని నిర్ణయించారు. అప్పటి నుంచి సికింద్రాబాద్‌లోని అమ్మవారిని ఉజ్జయిని మహంకాళి గా పూజించడం మొదలుపెట్టారు. ఈ దేవాలయం ఆషాఢ మాసంలో జాతర నిర్వహించడం అప్పట్లో అప్పయ్య అనే భక్తుడి నిర్ణయం ప్రకారం ఆనవాయితీగా మారింది.
సికింద్రాబాద్ ప్రాంతాన్ని పూర్వం “లష్కర్” (సైనిక స్థావరం) గా పిలిచేవారు. అందువల్ల, ఇక్కడ జరిగే బోనాలను లష్కర్ బోనాలు గా వ్యవహరించడం మొదలైంది.
ఈ పండుగ సందర్భంగా భక్తులు, ముఖ్యంగా మహిళలు, అందంగా అలంకరించిన కుండలలో బోనం (అమ్మవారికి సమర్పించే ప్రసాదం) తీసుకువస్తారు. వ్యాధులు, బాధల నుండి రక్షణ, సుఖ సంతోషాలు, శ్రేయస్సు కోరుతూ భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు. పోతరాజులు ఘటాలతో, భక్తులు ఫలహార బండ్లతో ఆలయానికి చేరుకొని తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ సంప్రదాయం తెలంగాణ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.


