Parental Liability for Underage Driving : మీ పిల్లలు బడికెళ్లే వయసులోనే బండి మీద చక్కర్లు కొడుతున్నారా..? వారి చేతికి వాహనం ఇచ్చి మురిసిపోతున్నారా? అయితే ఒక్క క్షణం ఆగండి! మీ ముద్దుల కొడుకు భవిష్యత్తును మీ చేతులారా ప్రమాదంలోకి నెడుతున్నారని తెలుసా..? సరదా కోసం చేసే ఈ పనులు వారి ప్రాణాలకే ముప్పు తెస్తున్నాయని గ్రహిస్తున్నారా..? ఇటీవల కాలంలో మైనర్లు నడుపుతున్న వాహనాల వల్ల జరుగుతున్న ఘోర ప్రమాదాలు కన్నవారికి కడుపుకోతను మిగులుస్తున్నాయి. ఇంతకీ, మైనర్ డ్రైవింగ్ పై చట్టం ఏం చెబుతోంది..? పట్టుబడితే ఎలాంటి కఠిన శిక్షలుంటాయి..? పోలీసుల హెచ్చరికల వెనుక ఉన్న చేదు నిజాలేంటి.?
ప్రాణాలు తీస్తున్న సరదా.. చిగురుటాకుల్లా రాలుతున్న బతుకులు : పట్టణాల నుంచి పల్లెల వరకు, పదో తరగతి కూడా పూర్తికాని పిల్లలు రోడ్లపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్లడం సర్వసాధారణ దృశ్యంగా మారింది. నియంత్రణ లేని వేగం, అనుభవ రాహిత్యం కారణంగా చిగురుటాకుల్లాంటి బతుకులు చితికిపోతున్నాయి.
ములుగు ఘటన: ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇంటర్ పాసైన ఆనందంలో, ములుగు జిల్లాకు చెందిన 17 ఏళ్ల విద్యార్థి స్నేహితులతో కలిసి కారులో వస్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ దుర్ఘటనలో ఆ విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, నలుగురు స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు.
ఎక్సైజ్ కాలనీ ప్రమాదం: ఇటీవలే తొమ్మిదో తరగతి విద్యార్థి ద్విచక్ర వాహనంపై వెళ్తూ అదుపు తప్పి మరో వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆ బాలుడితో పాటు ఎదుటి వ్యక్తి కూడా గాయపడ్డాడు. బాలుడని జాలిపడి అవతలి వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు కానీ, ప్రతిసారీ అదృష్టం వరించదు.
ఈ రెండు ఘటనలు మచ్చుకు మాత్రమే. తల్లిదండ్రులు తమ పిల్లల డ్రైవింగ్ చూసి మురిసిపోవడం కాదు, మనం లేనప్పుడు వారు ఎలా నడుపుతున్నారోనని ఆలోచించాలి. వారి వయసుకు పరిమితమైన విచక్షణతో ప్రమాదాల గురించి ఆలోచించకుండా దూసుకెళ్తారు. ఆ సరదానే వారి పాలిట శాపంగా మారుతోంది.
పట్టుబడితే… చుక్కలే : “మా అబ్బాయి బాగా నడుపుతాడులే” అనే ధీమాతో తల్లిదండ్రులు వాహనాలు ఇస్తున్నారు. కానీ, చట్టం దృష్టిలో ఇది తీవ్రమైన నేరం. పోలీసులు లేదా రవాణా శాఖ తనిఖీల్లో మైనర్లు పట్టుబడితే ఎదురయ్యే పరిణామాలు ఇవి.
భారీ జరిమానా: మోటారు వాహనాల చట్టం ప్రకారం, మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వాహన యజమానికి రూ. 25,000 వరకు జరిమానా విధించే అధికారం ఉంది.
జైలు శిక్ష: కేవలం జరిమానాతోనే వదిలిపెట్టరు. వాహన యజమానిపై కేసు నమోదు చేసి, నేరం రుజువైతే మూడు నెలల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే ప్రమాదం ఉంది.
వాహనం సీజ్: మైనర్లు నడిపిన వాహనాన్ని పోలీసులు తక్షణమే సీజ్ చేస్తారు.
బీమా వర్తించదు: ఒకవేళ మైనర్ వాహనం నడుపుతూ ప్రమాదానికి గురైతే, ఆ వాహనానికి బీమా కూడా వర్తించదు. నష్టమంతా యజమానే భరించాల్సి ఉంటుంది.
మైనర్‌పై చర్యలు: పట్టుబడిన మైనర్‌ను ఒకరోజు జువైనల్ హోంకు తరలించే అవకాశం కూడా ఉంది.
“తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలను ఇవ్వకూడదు. 18 ఏళ్లు నిండి, డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తర్వాతే ఇవ్వాలి. పిల్లలు వాహనాలను నియంత్రించలేక ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులపై కఠినమైన కేసులు నమోదు చేస్తాం.”
– రాయల ప్రభాకర్‌రావు, ట్రాఫిక్ అదనపు డీసీపీ


