Saturday, November 15, 2025
HomeతెలంగాణDriving Licence : దళారులకు దండం... ఇంట్లోంచే మీ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్!

Driving Licence : దళారులకు దండం… ఇంట్లోంచే మీ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్!

Online driving license renewal process in Telangana : మీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగుస్తోందా…? ఆర్టీఏ ఆఫీసు చుట్టూ తిరగాలా..? దళారులకు డబ్బులు సమర్పించుకోవాలా..? అనే చింత మిమ్మల్ని వేధిస్తోందా..? అయితే, ఆ బెంగ అక్కర్లేదు. సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో, ప్రభుత్వ సేవలు అరచేతిలోకి వచ్చేశాయి. దళారుల ప్రమేయం లేకుండా, ఇంట్లో మీ కంప్యూటర్ లేదా ఫోన్ నుంచే డ్రైవింగ్ లైసెన్స్‌ను ఎలా రెన్యూవల్ చేసుకోవాలో తెలియక తికమక పడుతున్నారా? అయితే, ఈ కథనం మీకోసమే. ఆ ప్రక్రియను సోపానాల వారీగా (step-by-step) ఎలా పూర్తి చేయాలో వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

ఆన్‌లైన్‌లో రెన్యూవల్… సులభమైన మార్గం : వాహనం నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. దాని గడువు ముగిశాక కూడా వాహనం నడపడం చట్టరీత్యా నేరం. నిబంధనల ప్రకారం, లైసెన్స్ గడువు ముగిసిన 30 రోజుల్లోపు దాన్ని పునరుద్ధరించుకోవాలి. ఈ గడువు దాటితే జరిమానా చెల్లించాల్సి వస్తుంది. జాప్యం పెరిగే కొద్దీ, కేవలం జరిమానాతో సరిపెట్టకుండా, మళ్లీ కొత్త లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన క్లిష్ట పరిస్థితి ఎదురవుతుంది. ఈ ఇబ్బందులన్నీ లేకుండా, తెలంగాణ రవాణా శాఖ ఆన్‌లైన్‌లో సులభమైన ప్రక్రియను అందుబాటులోకి తెచ్చింది.

రెన్యూవల్ ప్రక్రియ : కింద సూచించిన విధంగా దశలవారీగా మీరే సొంతంగా రెన్యూవల్ ప్రక్రియను పూర్తిచేసుకోవచ్చు:
వెబ్‌సైట్ సందర్శించండి: ముందుగా తెలంగాణ రవాణా శాఖ అధికారిక వెబ్​సైట్ https://tgtransport.net/ లోకి ప్రవేశించాలి.
ఆప్షన్ ఎంపిక: హోమ్‌పేజీలో కనిపించే ‘License’ అనే ఐచ్ఛికంపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత డ్రాప్‌డౌన్ మెనూలో ‘Driving Licence’ను ఎంచుకోవాలి.
రెన్యూవల్ స్లాట్ బుకింగ్: తెరుచుకున్న కొత్త పేజీలో ‘Renewal of Driving Licence’ ఆప్షన్‌ను, ఆపై ‘Click here to book the slot’ను క్లిక్ చేయాలి.
వివరాల నమోదు: ఇప్పుడు కనిపించే బాక్సుల్లో మీ డ్రైవింగ్ లైసెన్స్‌ నంబరు, జారీ చేసిన ప్రాంతం, పుట్టిన తేదీ, మొబైల్ నంబరు వంటి వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలి.
ఓటీపీ ధ్రువీకరణ: వివరాలు నింపాక ‘Request OTP’ పై క్లిక్‌ చేయాలి. మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి ప్రక్రియను కొనసాగించాలి.
రుసుము చెల్లింపు: అనంతరం నిర్దేశించిన రుసుమును ఆన్‌లైన్‌లో (డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/యూపీఐ ద్వారా) చెల్లించాలి. దీంతో మీ స్లాట్‌ బుకింగ్‌ పూర్తవుతుంది.
వైద్యుని ధ్రువీకరణ: స్లాట్ బుకింగ్ పత్రంతో పాటు, ఫిట్‌నెస్ ధ్రువీకరణ ఫారం (ఫారం 1A)ను డౌన్‌లోడ్ చేసుకుని, ప్రభుత్వ వైద్యునితో సంతకం చేయించుకోవాలి.
ఆర్టీఏ కార్యాలయ సందర్శన: మీరు బుక్ చేసుకున్న తేదీ మరియు సమయానికి, మీ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్, వైద్య ధ్రువపత్రం, ఇతర సంబంధిత పత్రాలతో సమీపంలోని ఆర్టీఏ కార్యాలయానికి వెళ్తే, అధికారులు వాటిని పరిశీలించి మీ లైసెన్స్‌ను రెన్యూవల్ చేస్తారు.

కొత్త లైసెన్స్ కావాలా :  18 ఏళ్లు నిండిన వారు కొత్త లైసెన్స్ కోసం మీ-సేవ కేంద్రాల్లో లేదా నేరుగా రవాణా శాఖ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా లెర్నింగ్ లైసెన్స్ (LLR) కోసం స్లాట్ బుక్ చేసుకుని, కంప్యూటర్ ఆధారిత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఎల్ఎల్ఆర్ పొందిన నెల రోజుల తర్వాత శాశ్వత లైసెన్స్ కోసం స్లాట్ బుక్ చేసుకుని, అధికారుల ఎదుట వాహనాన్ని నడిపి చూపించాల్సి ఉంటుంది. ఉత్తీర్ణులైన వారికి కార్డును పోస్ట్ ద్వారా ఇంటి చిరునామాకు పంపిస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad