కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బహిరంగ సభ జరుగుతుండగా బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖ్య అనుచరులు, నాయకులు, యువకులు జమ్మికుంట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయడం సర్వత్ర చర్చాంశానియంగా మారింది. ఈ సందర్భంగా బిజెపికి రాజీనామా చేసిన ఈటల ముఖ్య అనుచరుడు జువ్వాజి కుమార్ తో పాటు పలువురు నాయకులు మాట్లాడుతూ… హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం కోసం అహర్నిశలు కృషి చేశామని అన్నారు. ఈటల ప్రస్తుతం తమని పట్టించుకోకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఉప ఎన్నికల సమయంలో డబ్బులకు ఆశపడకుండా, బెదిరింపులకు భయపడకుండా స్వచ్ఛందంగా ఈటల వెంట ఉంటూ ఆయన విజయం కోసం పని చేశామన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, కమలాపూర్ మండలాలకు చెందిన జవ్వాజి కుమారస్వామి, మహమ్మద్ జానీ, రాపర్తి అఖిల్ గౌడ్, పొన్నాల అనిల్, మార్క అరవింద్, బండారి సాగర్, పిట్టల అనిల్, రుద్రవేణ సుధాకర్, ఎరబాటి రమేష్, ఉప్పుల రాజు తో పాటు సుమారు 100 మంది యువకులు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు.