Withholding student certificates : రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలలు నిబంధనలకు పాతర వేస్తున్నాయి. అడ్మిషన్ సమయంలో కేవలం బదిలీ ధ్రువపత్రం (TC) మాత్రమే తీసుకోవాలన్న స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, విద్యార్థుల పది, ఇంటర్ ఒరిజినల్ సర్టిఫికెట్లను సైతం గుప్పిట్లో పెట్టుకుంటున్నాయి. ఫీజు బకాయిలను రాబట్టుకునేందుకు కళాశాలలు పన్నుతున్న ఈ కొత్త పన్నాగం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి..?
రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యార్థుల భవిష్యత్తు కళాశాలల కబంధ హస్తాల్లో చిక్కుకుంది. ఫీజు బకాయిలను వసూలు చేసుకునేందుకు యాజమాన్యాలు అడ్డదారులు తొక్కుతున్నాయి. 2025-26 విద్యా సంవత్సరంలో బీటెక్ మొదటి సంవత్సరంలో చేరిన వేలాది మంది విద్యార్థుల అసలు ధ్రువపత్రాలను నిబంధనలకు విరుద్ధంగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కేవలం ఒరిజినల్ టీసీ మినహా మరే ఇతర సర్టిఫికెట్లను తీసుకోరాదన్న ప్రభుత్వ నిబంధనను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి. భవిష్యత్తులో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలున్నా, విద్యార్థులు సొంతంగా చెల్లించాల్సిన ఫీజులున్నా.. వాటన్నింటినీ రాబట్టుకునేందుకు ఈ సర్టిఫికెట్లనే ఆయుధంగా వాడుకునేందుకు సిద్ధమవుతున్నాయి.
ఆదేశాల్లోని లొసుగే ఆసరా : కన్వీనర్ కోటాలో సీటు పొందిన విద్యార్థులు కళాశాలలో కేవలం ఒరిజినల్ టీసీ మాత్రమే సమర్పించాలని, మిగిలిన సర్టిఫికెట్లన్నీ జిరాక్స్ కాపీలు ఇస్తే సరిపోతుందని ఎప్‌సెట్ ప్రవేశాల కన్వీనర్ జారీచేసే సీటు కేటాయింపు లేఖలో ఉంటుంది. అయితే, “ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం, అనుమతులు రద్దు చేస్తాం” వంటి కఠినమైన హెచ్చరికలు ఆ లేఖలో లేకపోవడం కళాశాలలకు వరంగా మారింది. దీంతో, “విద్యార్థులే తమ సర్టిఫికెట్లు మా వద్ద భద్రంగా ఉంటాయని ఇచ్చారు” అని చెప్పుకునేందుకు యాజమాన్యాలకు అవకాశం దొరికిందని విద్యావేత్తలు ఆరోపిస్తున్నారు.
తల్లిదండ్రుల ఆవేదన : “మా అబ్బాయికి జీడిమెట్ల సమీపంలోని ఓ కాలేజీలో సీటొచ్చింది. అక్కడ అందరూ ఒరిజినల్స్ ఇచ్చారని తెలిసింది. మేము ఇవ్వకపోతే మా వాడిని ఏమైనా ఇబ్బంది పెడతారేమోనన్న భయంతో ఇవ్వక తప్పలేదు,” అని ఓ విద్యార్థి తండ్రి తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది కన్వీనర్ కోటాలో సుమారు 75 వేల మంది, మేనేజ్‌మెంట్ కోటాలో 20 వేల మందికి పైగా విద్యార్థులు చేరగా, వీరిలో అత్యధికుల సర్టిఫికెట్లు ఇప్పుడు కళాశాలల వద్దే ఉన్నాయి.
అధికారుల తీరుపై విమర్శలు : గతంలో ఫీజులు చెల్లించలేదన్న నెపంతో ఎందరో విద్యార్థులకు కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధించిన ఘటనలు ఉన్నాయి. ఉద్యోగం వచ్చినా, ఎంటెక్ వంటి ఉన్నత చదువులకు వెళ్లాలన్నా సర్టిఫికెట్లు ఇవ్వకుండా తిప్పించుకున్నారని విద్యార్థులు ఉన్నత విద్యామండలికి, జేఎన్‌టీయూహెచ్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. ఫిర్యాదు అందినప్పుడు సదరు విద్యార్థికి సర్టిఫికెట్లు ఇవ్వాలంటూ కళాశాలకు లేఖ రాయడం మినహా, అసలు నిబంధనలకు విరుద్ధంగా ఒరిజినల్స్ ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించడం గానీ, ఆకస్మిక తనిఖీలు చేయడం గానీ అధికారులు చేపట్టడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆరు నెలల క్రితం బాచుపల్లిలోని గోకరాజు రంగరాజు కళాశాలకు జేఎన్‌టీయూహెచ్ షోకాజ్ నోటీసు ఇచ్చాకే విద్యార్థులకు న్యాయం జరగడం ఇందుకు నిదర్శనం.


