దేశంలో తెలంగాణ లోనే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉన్నది, అత్యంత భద్రత కలిగిన రాష్ట్రం తెలంగాణనే అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధన్యాతనిస్తున్నదని మంత్రి చెప్పుకొచ్చారు. సీఎం కేసిఆర్ గారు పోలీస్ వ్యవస్థలో తెచ్చిన సంస్కరణలను ప్రజలకు తెలియ చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హనుమకొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన సురక్ష దినోత్సవం ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, కడియం శ్రీహరి, హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్, సిపి ఏ.వి రంగనాథ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్:
పెరుగుతున్న జనాభా, నేరాలు, సైబర్ క్రైమ్…ఏ మూలన ఏం జరిగినా డేగ కళ్ళతో పర్యవేక్షించే వ్యవస్థ నేడు మన సొంతం. నేరస్తులు ఏ మూలన దాగినా సకాలంలో వాళ్ళను పట్టుకోవడంలో మన పోలీసులు దేశవ్యాప్తంగా పేరు గడించారు. మహిళల భద్రత కోసం రాష్ట్రంలో మొత్తం 331 షీ టీమ్ లను ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు షి టీమ్స్ కు 46 వేల 241 ఫిర్యాదులు అందగా, 19 వేల 966 మందిని అరెస్టు చేశారు. మన రాష్ట్రాన్ని, పోలీస్ లను ఆదర్శంగా తీసుకొని చాలా రాష్ర్టాలు ‘షీ టీమ్స్’ ను ప్రవేశ పెడుతున్నాయి. దేశంలోనే మొదటి సారిగా అంతర్జాతీయ ప్రమాణాలతో పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను హైదరాబాద్ లో నిర్మించింది. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో లక్ష కెమెరాల పుటేజీని ఒక్క నిమిషంలోనే పరిశీలించే ఆధునిక పరికరాలు, పరిజ్ఞానం అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీ టీవీ కెమెరా దృశ్యాలైనా సరే, హైదరాబాద్‌లో ఉన్న ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి చూడవచ్చు.
జోగులాంబ గద్వాల, ఖమ్మం, నల్గొండ, సిద్దిపేట, మెదక్, మహబూబాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, వికారాబాద్, సూర్యపేట్, మేడ్చల్ మల్కాజ్ గిరిలో భరోసా కేంద్రాలు పనిచేస్తున్నాయి. రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల్లో శాంతి భద్రతలను పటిష్ట పరిచేందుకు రాష్ట్రంలో మొత్తం 10 లక్షల 66 వేల 792 సీసీ కెమెరాలను వినియోగిస్తున్నారు. ప్రతీ వెయ్యి మంది పౌరులకు 30 క్లోజ్డ్ సర్క్యూట్ టీవీ (సీసీటీవీ) సర్వైలెన్స్ అందుబాటులోకి తేవడం ద్వారా దేశంలోనే తెలంగాణ రాజధాని టాప్ ప్లేస్‌లో నిలిచింది, ప్రపంచంలో 16వ స్థానం పొందింది. NCRB నివేదిక ప్రకారం సిసి కెమెరాల సహాయంతో పెద్ద సంఖ్యలో కేసులను గుర్తించారు.
ఈ-ఛాలన్ సిస్టమ్
రాష్ట్ర వ్యాప్తంగా ఈ-ఛాలన్ సిస్టమ్ ను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. న్యూయార్క్ లోని మెర్సర్ అనే స్వతంత్ర ఏజెన్సీ హైదరాబాద్ నగర్ ఉత్తమ నివాసయోగ్య నగరంగా గుర్తించింది. క్రైట్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ (CCTNS) ను ఇంటర్ ఆపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ICJS) అనుసంధానించిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015 లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు నూతనంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేశాం. కొత్తగా 5 పోలీస్ స్టేషన్ ల తోపాటు 3 పోలీస్ సర్కిల్ ఒక పోలీస్ డివిజనల్ కార్యాలయం అలాగే నిర్ణయం నాలుగు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశాం. పోలీస్ కమిషనరేట్ కోసం అత్యాధునిక హంగులతో సుమారు 50 కోట్ల వ్యయంతో నూతన భవన నిర్మాణాన్ని చేపడుతున్నాం.