Sunday, November 16, 2025
HomeతెలంగాణFarmhouses : నగర శివార్లలో ఫామ్‌హౌస్‌లు.. చీకటి సామ్రాజ్యానికి అడ్డాగా మారుతున్న వైనం!

Farmhouses : నగర శివార్లలో ఫామ్‌హౌస్‌లు.. చీకటి సామ్రాజ్యానికి అడ్డాగా మారుతున్న వైనం!

Hyderabad farmhouses illegal parties : నగరం విస్తరిస్తున్న కొద్దీ శివార్లలో ఫామ్‌హౌస్‌ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడపాలని ఆశించేవారికి ఇవి ఒకప్పుడు చక్కని వేదిక. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. “డబ్బులిస్తే ఏదైనా చేసుకోవచ్చు” అనే ధోరణిలో కొన్ని ఫామ్‌హౌస్‌లు రాత్రివేళ వినోదాలకు, అసాంఘిక కార్యకలాపాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. పుట్టినరోజు వేడుకలు, మందు, విందులతో పాటు ముజ్రా, రేవ్‌ పార్టీలు.. కొన్నింటిలో ఏకంగా డ్రగ్స్‌ పార్టీలు సైతం యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. 

- Advertisement -

ఫామ్‌హౌస్‌ల దుర్వినియోగం – నిబంధనలకు తిలోదకాలు: రంగారెడ్డి జిల్లా పరిధిలో 900కు పైగా ఫామ్‌హౌస్‌లు ఉండగా, వాటిలో చాలా వాటికి సంబంధిత అధికారుల నుంచి అనుమతులు లేవని తెలుస్తోంది. రెవెన్యూ రికార్డుల్లో ఇవి ఇంకా పంట పొలాలు లేదా వ్యవసాయ భూములుగానే కొనసాగుతున్నాయి. వాస్తవానికి వ్యవసాయ భూమిని ఇతర అవసరాలకు ఉపయోగించాలంటే కచ్చితంగా నాలా కన్వర్షన్ (వ్యవసాయేతర భూమిగా మార్పిడి) చేసుకోవాలి. కానీ, కొంతమంది నిర్వాహకులు నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా, వ్యవసాయేతర భూమిగా మార్చుకోకుండానే భారీ నిర్మాణాలను చేపట్టేస్తున్నారు. మంచాల మండలం లింగంపల్లిలో ఇటీవల ఓ ఫామ్‌హౌస్‌లో ముజ్రా పార్టీ నిర్వహించిన విషయం అక్రమాలకు అద్దం పడుతోంది.

అక్రమార్కులకు ఆదాయ వనరు – చీకటి పార్టీల నిర్వహణ: నగర శివార్లలోని శంషాబాద్, రాజేంద్రనగర్, షాబాద్, చేవెళ్ల, శంకర్‌పల్లి, జన్వాడ, మొయినాబాద్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలాల్లో అత్యధిక సంఖ్యలో ఫామ్‌హౌస్‌లు ఉన్నాయి. వీటిని కొంతమంది ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ముజ్రా పార్టీలు నిర్వహిస్తామంటూ సోషల్ మీడియాలో సందేశాలు పంపుతూ, శుక్ర, శనివారాల్లో ప్రత్యేక ఏర్పాట్లు, పోలీసుల తనిఖీలు ఉండవంటూ వారికి భరోసా ఇస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా పార్టీలు నిర్వహిస్తూ, నిబంధనలను అతిక్రమిస్తున్నారు. కోడి పందేలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు కూడా కొన్ని ఫామ్‌హౌస్‌లను ఉపయోగిస్తున్నట్లు గతంలో పోలీసు తనిఖీల్లో వెల్లడైంది.

వెలుగులోకి వచ్చిన కొన్ని ఘటనలు – నేరాల నిలయం: మైనర్ల ‘ట్రాప్‌హౌస్’ పార్టీ: గత అక్టోబర్‌లో మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన మైనర్ల పార్టీ వ్యవహారం సంచలనం సృష్టించింది. నగరానికి చెందిన ఓ డీజే ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ట్రాప్‌హౌస్ 9MM’ పేరుతో అకౌంట్ నిర్వహించి, మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో పార్టీ నిర్వహిస్తున్నట్లుగా ప్రచారం చేశాడు. ఒక్కరికి రూ.1,600, జంటగా వస్తే రూ.2,800గా రుసుము నిర్ణయించాడు. మైనర్లు సైతం ఈ ప్రకటనలకు ఆకర్షితులై పార్టీకి హాజరయ్యారు. పోలీసులకు సమాచారం అందడంతో దాడి చేసి వారిని పట్టుకున్నారు.

డ్రగ్స్ పార్టీపై దాడులు: ఈ ఏడాది ఆగస్టులో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం బాకారంలోని ఓ ఫామ్‌హౌస్‌లో పోలీసులు దాడులు నిర్వహించారు. డ్రగ్స్, గంజాయి వినియోగంతో పార్టీ జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు 51 మందిని గుర్తించారు, వారిలో ఉగాండా, కెన్యాతో పాటు మరో రెండు ఆఫ్రికన్ దేశాలకు చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు.

అధికారుల నిర్లక్ష్యం – ప్రభుత్వ ఆదాయానికి గండి: మహేశ్వరం, మొయినాబాద్‌ మండలాల్లో అత్యధికంగా దాదాపు 500 వరకు ఫామ్‌హౌస్‌లు ఉండగా, కోహెడలో 35 ఉన్నాయి. పంచాయతీ, పురపాలక అధికారులు నిబంధనల ఉల్లంఘనపై చోద్యం చూస్తున్నారే తప్ప, నిర్వాహకులపై చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. నిబంధనల ప్రకారం 300 మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉంటే హెచ్‌ఎండీఏ (HMDA) నుంచి అనుమతి తప్పనిసరి. కానీ ఎవరూ అలా చేయడం లేదు. ఇది ఒకవైపు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతుండగా, మరోవైపు ఈ ఫామ్‌హౌస్‌లు నేరాలకు, చీకటి కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి.

భవిష్యత్ కార్యాచరణ – నిఘా పెంపు అవశ్యకత: కొన్ని ఫామ్‌హౌస్‌లపై పోలీసులు ఇప్పటికే దాడులు నిర్వహించి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని పట్టుకున్నారు. అయితే, ఈ అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా నిరోధించడానికి మరింత నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. సంబంధిత రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్ అధికారులు పోలీసులతో కలిసి సమన్వయంతో పని చేసి అక్రమ ఫామ్‌హౌస్‌లను, వాటిలో జరిగే నేరాలను కట్టడి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad