Private Colleges in Telangana Reopen: గత ఐదు రోజులుగా రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రైవేట్ కళాశాలల బంద్‌కు తెరపడింది. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. రూ. 900 కోట్ల బకాయిలు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ నిర్ణయంతో రేపటి నుంచి తెలంగాణలో ప్రైవేట్ కళాశాలలు తెరుచుకోనున్నాయి.
Also Read: https://teluguprabha.net/telangana-news/cm-revanth-reddy-warning-to-private-colleges-on-bandh/
ఈ మేరకు శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరాలు తెలిపారు. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు బకాయిల కోసం రూ. 1500 కోట్లు అడిగినట్లు భట్టి చెప్పారు. ఇప్పటికే రూ. 600 కోట్లు విడుదల చేశామని.. మరో మూడు రోజుల్లో రూ. 600 కోట్లు రిలీజ్ చేస్తామని వెల్లడించారు. మిగతా రూ. 300 కోట్లు కూడా త్వరలోనే క్లియర్ చేస్తామని స్పష్టం చేశారు.
కాగా, రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానానికి సంబంధించి సమగ్రంగా అధ్యయనం చేసేందుకు త్వరలో ఓ కమిటీ వేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పాలసీలో ఎలాంటి సంస్కరణలు చేయాలో కమిటీలోని అధికారులతో పాటు కళాశాల యాజమాన్య ప్రతినిధులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. మూడు నెలల్లోగా నివేదిక సమర్పించాలని కమిటీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Also Read: https://teluguprabha.net/telangana-news/harish-rao-sensational-comments-on-cm-revanth/
అయితే, గత కొంతకాలంగా పేరుకుపోయిన బకాయిలు విడుదల చేయాలని ప్రైవేటు కళాశాలలు ఎప్పటినుంచో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం కొన్ని నిధులు మాత్రమే విడుదల చేయడంతో కాలేజీలు నిర్వహించడం కష్టంగా మారిందని యాజమాన్యాలు ఆరోపించాయి. ఈ క్రమంలో మరోసారి ఆందోళనకు దిగిన ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య.. నవంబర్ 3 నుంచి కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. ఇంజినీరింగ్, ఫార్మసీ తదితర వృత్తి విద్యా కోర్సులతో పాటు డిగ్రీ, పీజీ కళాశాలలు బంద్ పాటించాయి. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ రోజు ప్రైవేటు కళాశాలల యాజమాన్య ప్రతినిధులతో చర్చలు జరిపారు. చర్చలు సఫలం కావడంతో రేపటి నుంచి కాలేజీలు యథావిధిగా తెరుచుకోనున్నాయి.


