Kova Lakshmi: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం హఠాత్తుగా రాజకీయ గందరగోళానికి దారితీసింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన అసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్యామ్ నాయక్ మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ వాదన తీవ్రంగా మారి, కొన్నిసేపటికి ఎమ్మెల్యే కోవా లక్ష్మి కోపంతో తనముందు ఉన్న వాటర్ బాటిల్‌ను శ్యామ్ నాయక్ వైపు విసరడంతో పరిస్థతి మరింత ఉద్రిక్తంగా మారింది.
ఈ ఘటన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతున్న సమయంలో చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కోవా లక్ష్మి తన ప్రసంగంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించేందుకు ప్రయత్నించారు. అయితే ఇది ప్రభుత్వ కార్యక్రమమని, ఇందులో రాజకీయ ప్రసంగాలు చేయడం తగదంటూ శ్యామ్ నాయక్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
అధికారులు గతంలో రేషన్ కార్డులు, సన్న బియ్యం ఇవ్వలేదని, ఇప్పుడే ఇస్తున్నారని చెప్పిన నేపథ్యంలో కోవా లక్ష్మి తన ప్రసంగంలో వివరణ ఇవ్వాలని ప్రయత్నించారు. కానీ శ్యామ్ నాయక్ అడ్డు పడడంతో ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ నేపథ్యంలో కోపానికి గురైన ఎమ్మెల్యే వాటర్ బాటిల్‌ను విసిరినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో కార్యక్రమం కాసేపు గందరగోళంగా మారింది. అక్కడున్న ప్రజలు, అధికారులు ఏలాగైనా పరిస్థితిని శాంతింపజేయాలని ప్రయత్నించారు. అయితే, అధికార కార్యక్రమంలో రాజకీయ విమర్శలు, వ్యక్తిగత దూషణలతో విషయం క్రమేపీ చర్చనీయాంశమైంది.


