పోలీసులను ఉపయోగించి రాష్ట్రంలోని ప్రతిపక్షాలను అణిచివేయడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడులను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ధర్నాకు పిలుపునిచ్చింది. దీంతో ఉదయం నుంచి పోలీసులు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. దీనిపై హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
“ఉమ్మడి నల్గొండ జిల్లా సహా హైదరాబాద్‌లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎక్కడిక్కడ అరెస్టులు చేయడాన్ని, గృహ నిర్భంధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ కార్యాలయం పై కాంగ్రెస్ గూండాల దాడులను నిరసిస్తూ జిల్లా కేంద్రంలో చేపట్టిన ధర్నా కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు అక్రమ అరెస్టులకు తెర లేపడం దుర్మార్గం. పోలీసు బలం ఉపయోగించి, ప్రతిపక్షాలను అణిచివేయాలని చూడటం అప్రజాస్వామికం. అక్రమ అరెస్టులు చేసిన బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.”అని తెలిపారు.