ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసు మీద ఉన్న శ్రద్ధ ఆడపిల్లల ఉద్యోగాలపై లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. నియామకాల్లో మహిళల రిజర్వేషన్లను హరించే జీవో 3ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు జరిపిన నియామకాల్లో ఎంత మంది మహిళలకు ఉద్యోగాలు లభించాయి అన్నదానిపై వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో 3 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఈ అంశంపై త్వరలో గవర్నర్ ను కలవబోతున్నట్లు ప్రకటించారు.
జీవో 3కు వ్యతిరేకంగా భారత జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… సాధారణంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఉత్సవాలు చేసుకుంటారని, కానీ ఈ సారి తెలంగాణలో పరిస్థితి వేరుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు కూడా ధర్నా చేయాల్సిన దౌర్భార్య స్థితిని ప్రభుత్వం కల్పించిందని మండిపడ్డారు.
1996లో తెలంగాణ బిడ్డ పీవీ నరసింహా రావు దేశ ప్రధానిగా మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇంకా పెంచుకున్నామని, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసు నియామకాల్లో కూడా రిజర్వేషన్లను కల్పించిందని, మార్కెట్ కమిటీ పదవుల్లోనూ మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేసీఆర్ దని స్పష్టం చేశారు. కేసీఆర్ తీసుకున్న చర్యల వల్ల యూనివర్సిటీల్లో మహిళల సంఖ్య పెరిగిందని, మహిళలకు హాస్టళ్ల సంఖ్యను కూడా పెంచారని చెప్పారు. అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ హయాంలో లక్షా 66 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తే 33 శాతం రిజర్వేషన్లను మహిళలకు కల్పించామని వివరించారు.
కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరాల నుంచి ఉన్న హక్కులను కొల్లగొట్టిందని ధ్వజమెత్తారు. నియామకాల్లో హారిజాంటర్ రిజర్వేషన్లు అమలు చేయాలని సుప్రీం కోర్టు 2022లో తీర్పు ఇచ్చిందని, దాన్ని అమలు చేయాలని తెలంగాణ హైకోర్టు కూడా చెప్పిందని, కానీ ఆ తీర్పు అమలు చేస్తే ఆడబిడ్డలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది కాబట్టి అమలు చేయబోమని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ తేల్చిచెప్పారని వివరించారు. హైకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసును రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉపసంహరించుకుందని పేర్కొన్నారు. “ఆడపిల్లల శవాల మీద పేలాలు ఏరుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. వ్యక్తిగత కారణాలతో మరణించిన ఆడపిల్లల ఉదంతాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి వాడుకుంది. విద్యార్థులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం ఇప్పుడు అన్యాయం చేస్తున్నది. ” అని వ్యాఖ్యానించారు. 33 శాతం రిజర్వేషన్లను హరిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీవో 3ను జారీ చేసిందని గుర్తు చేశారు.
గురుకులాల నియామకాల్లో జీవో 3ను అమలు చేయడం వల్ల మహిళలకు కేవలం 12 శాతం మాత్రమే రిజర్వేషన్లు లభించాయని స్పష్టం చేశారు. జీవో 3 వల్ల నష్టం జరుగుతోందనడానికి ఇదే నిదర్శనమని తెలిపారు. ఇక ముందు వచ్చే నోటిఫికేషన్లలో కూడా పరిస్థితి ఇలానే ఉండబోతుందని అన్నారు. కాబట్టి జీవో 3ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీవోను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని, ముఖ్యమంత్రిని నిద్రపోనివ్వబోమని తేల్చిచెప్పారు. గురుకులా నియామకాల్లో వికలాంగులకు ఇవ్వాల్సిన 4 శాతం రిజర్వేషన్లు కూడా ఇవ్వలేదని లేవనెత్తారు.
“సీఎం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొరికిన వ్యక్తి. ఆ కేసులో హైకోర్టులో ఓడిపోతె సుప్రీం కోర్టుకు పోతాడు. అక్కడ వ్యతిరేకంగా వస్తే రివ్యూ పిటిషన్ వేస్తాడు. కానీ ఆడపిల్లల కేసు విషయంలో మాత్రం ఎవరినీ సంప్రదించలేదు. ఓటుకు నోటు కేసు మీద ఉన్న శ్రద్ధ ఆడపిల్లల ఉద్యోగాల విషయంలో ఎందుకు లేదు” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. నియామకాల్లో మహిళల రిజర్వేషన్ల కోసం హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని, అవసరమైతే సుప్రీం కోర్టుకు కూడా వెళ్లాలని డిమాండ్ చేశారు.
మహిళలకు రూ. 500కే సిలిండర్ ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పిందని, అంటే మహిళలకు ఉద్యోగాలను ఎగరగొట్టి వంటింట్లో కూర్చోబెట్టాలని ఉద్ధేశించే కాంగ్రెస్ ఆ హామీ ఇచ్చిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రగతి నిరోధక మహిళా వ్యతిరేకిగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వంలో పారదర్శకం లేదని, ముఖ్యమంత్రి ప్రజలను కలవడం లేదని విమర్శించారు.
ముఖ్యమంత్రికి ప్రజా వాణి వినిపించదని, కేవలం ఢిల్లీ వాణి మాత్రమే వినిపిస్తుందని చెప్పారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మాత్రం పార్లమెంటుకు వెళ్లాలి కానీ తెలంగాణ మహిళలు మాత్రం వంటింటికి పరిమితం కావాలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జీతాలు రావడం లేదని ఆశా, అంగన్వాడీ వర్కర్లు, 108 వర్కర్లు చెబుతున్నారని ప్రస్తావించారు.
కాళేశ్వరంలో నిండుకుండలా నీళ్లు ఉన్నా కూడా ఆ నీళ్లను పొలాలకు మలిపే తెలివిలేని ప్రభుత్వం ఉండడం మన దౌర్భాగ్యమని అన్నారు. రైతు బంధు నిధులను పంపిణీ చేయడం లేదని, 100 రోజుల తర్వాత ప్రతీ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. బీసీ కులగణన కోసం తూతూమంత్రంగా తీర్మానం ఆమోదించారని పేర్కొన్నారు. ఆడబిడ్డలుగా పుట్టినవాళ్లకు అంబేద్కర్ హక్కలు ఇచ్చారని కొనియాడారు.
“తొందరపాటు నిర్ణయాలు తీసుకొని పూటకో మాట మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు రేసు గుర్రం కాదు.. గుడ్డిగుర్రంలా కనిపిస్తున్నరు. కేసీఆర్ ను ఆడిపోసుకోవడం మానేసి ఆడబిడ్డలకు అన్యాయం చేసే జీవో3ను వెనక్కి తీసుకోవాలని ధర్నా చౌక్ వేదికగా డిమాండ్ చేస్తున్నా. ఎవరైనా ధర్నాలు చేసుకోవచ్చునని చెప్పి..మూడు రోజులు నాన్చి ఆలస్యంగా పర్మిషన్ ఇచ్చారు.. ఇదేనా ప్రజా పాలన అంటే..?ధర్నాకు హాజరయ్యేందుకు వస్తున్న ఆడబిడ్డలను అరెస్ట్ చేస్తే సమస్య పరిష్కారం కాదని గుర్తుంచుకోండి” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్, జగిత్యాల జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు దేవి ప్రసాద్, రాజీవ్ సాగర్, గజ్జల నగేష్, తాడురి శ్రీనివాస్, అనిల్ కుర్మాచలం, గెల్లు శ్రీనివాస్, టీయస్పిఎస్సి మాజీ సభ్యురాలు సుమిత్ర తనోబా , BRS రాష్ట్ర నాయకులు ముఠా జై సింహా , యు పి ఎఫ్ కన్వీనర్ గట్టు రామచంద్రరావు , కో కన్వీనర్ రాజారాం యాదవ్, కోలా శ్రీనివాస్, ఆర్వి మహేందర్, బొల్లా శివ శంకర్ , భారత్ జాగృతి జెనరల్ సెక్రెటరీ నవీన్ ఆచారి, ఉపాధ్యక్షురాలు వరలక్ష్మి మంచాల, స్టేట్ సెక్రెటరీ అనంతుల ప్రశాంత్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు నరేందర్ యాదవ్ మరియు నాయకులు పాల్గొన్నారు..