Tuesday, September 17, 2024
HomeతెలంగాణGangula: తక్షణం ఇంటర్మీడియట్ గోడౌన్లలో ధాన్యం దించండి

Gangula: తక్షణం ఇంటర్మీడియట్ గోడౌన్లలో ధాన్యం దించండి

రాష్ట్రంలో ధాన్యం సేకరణ వేగంగా జరుగుతుందని, గతంకన్నా పది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికంగా సేకరించామని, రాబోయే పదిరోజులు మరింత కీలకం కాబోతున్న నేపథ్యంలో ఎట్టిపరిస్థితుల్లోనూ ధాన్యం అన్లోడింగ్ సమస్య ఉత్పన్నం కావద్దని, రైతులు రోడ్లపైకి రాకుండా చూడాలని, మిల్లుల వద్ద స్టోరేజీ లేని చోట, మిల్లులు సహకరించని చోట తక్షణమే ఇంటర్మీడియట్ గోడౌన్లు తీసుకొని మిల్లర్లతో సంబందం లేకుండా అన్లోడింగ్ చేసి రైతులకు సకాలంలో డబ్బులు అందేలా చూడాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. ఈమేరకు డా.బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో నేడు బుదవారం వీడియో కాన్పరెన్స్ నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ధాన్యం సేకరణ చేస్తున్న కలెక్టర్లకు, జిల్లా యంత్రాంగానికి అభినందనలు తెలియజేసారు మంత్రి గంగుల కమలాకర్. గతం కన్నా 500 కొనుగోలు కేంద్రాలు, గతం కన్నా అధికంగా రైతుల నుండి సేకరణ, అధికంగా నిధులను అందజేసామన్నారు.

సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని, వ్యవసాయం పండగ చేసేలా అవసరమైన నీళ్లు, ఉచిత కరెంటు, పెట్టుబడి సాయం అందజేస్తూ దేశంలోనే ఎక్కడాలేని విదంగా కనీస మద్దతు ధరతో సేకరిస్తున్నారని, ఈ సమయంలో అక్కసుతో ప్రతిపక్షాలు చేసే రాజకీయాలను పట్టించుకోవద్దని, కేవలం రైతు ప్రయోజనాలే కేంద్రంగా పనిచేసి ధాన్యం సేకరణ చేయాలని కలెక్టర్లకు సూచించారు మంత్రి గంగుల. రైతులు కేంద్రం నిర్దేశించిన ఎఫ్.ఏ.క్యూ ప్రమాణాలతో ఖచ్చితంగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తేవాలని, ఈ విషయంలో వారికి అవగాహన పెంపొందించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎఫ్.ఏ.క్యూ ప్రకారం ధాన్యం సేకరణ చేయాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ తాలు, తరుగు సమస్య ఉత్పన్నం కాకూడదన్నారు. తెలంగాణ రైతాంగం పండించిన పంట గింజ వదలకుండా కొనడం ఎంత ముఖ్యమో పక్క రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోళ్లు లేనందున అక్కడి ధాన్యం తెలంగాణలోకి రాకుండా పటిష్ట రక్షణ చర్యలు తీసుకోవడం సైతం అంతే ముఖ్యం అన్నారు.

- Advertisement -

అక్కడక్కడా ధాన్యం అన్లోడింగ్ చేయడంలో మిల్లర్లతో ఇబ్బందులు వస్తున్నాయని, తద్వారా ట్రాన్స్ పోర్ట్ సమస్యలు తలెత్తుతున్నాయని తన ద్రుష్టికి వచ్చిందన్న మంత్రి, ఈ సమస్యల పరిష్కారం కోసం తక్షణమే ఇంటర్మీడియట్ గోదాంలు ఏర్పాటు చేసుకోవాలని, ట్రాన్స్ పోర్ట్ కోసం అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను ఎంచుకొని అవసరమైన చోట స్థానిక ట్రాక్టర్లను సైతం వాడుకోవాలని మంత్రి గంగుల కమలాకర్ కలెక్టర్లకు సూచించారు. ఇంటర్మీడియట్ గోదాములు హైర్ చేసే అవకాశం లేని జిల్లాలు, తమ చుట్టు పక్కల జిల్లాల్లో సైతం ఏర్పాటు చేసుకోవాలని, రాష్ట్ర సరిహద్దులకు సమీపంలో గల జగ్గయ్యపేట్, రాయ్ చూర్, బీదర్ తదితర ప్రాంతాల్లో సైతం ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ ఇంటర్మీడియట్ గోదాముల్లో దించే ధాన్యంతో మిల్లర్లకు ఎటువంటి సంబందం ఉండకూడదని, అధికార యంత్రాంగం బాధ్యతతో వెంటనే రైతులకు చెల్లింపులు జరిగేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు మంత్రి.

ధాన్యం సేకరణతో పాటు సీఎంఆర్ ప్రక్రియ కూడా జరుగుతుండడంతో అక్కడక్కడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని కలెక్టర్లు మంత్రి ద్రుష్టికి తెచ్చారు. ప్యాక్స్ గోదాంలు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ గోదాంలు, రైతువేదికలు, తదితర ప్రభుత్వ స్థలాలతో పాటు ప్రైవేట్ ఇంటర్మీడియట్ గోదాంల ఏర్పాటుతో ఈ ఇబ్బందిని అధిగమిస్తున్నామని కలెక్టర్లు వెల్లడించారు. ఇప్పటికే ఇంటర్మీడియట్ గోడౌన్లలో మెదక్లో 30700 మెట్రిక్ టన్నులు, జగిత్యాలలో 52000, సూర్యాపేటలో 40000 మెట్రిక్ టన్నులు ఏర్పాటు చేసామని కలెక్టర్లు చెప్పారు. మంత్రి గంగుల ఆదేశం మేరకు రాబోయే పదిహేను రోజులు జిల్లాయంత్రాంగం పూర్తిగా క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండి ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగేలా చూస్తామని కలెక్టర్లు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్తో పాటు సివిల్ సప్లైస్ కార్పోరేషన్ ఛైర్మన్ రవీందర్ సింగ్, కమిషనర్ అనిల్ కుమార్, జీఎంలు రాజారెడ్డి, శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News