పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలందరూ పోలీసులకు సహకరించాలి గార్ల బయ్యారం సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ సబ్ ఇన్స్పెక్టర్ జీనత్ కుమార్ లు అన్నారు. గార్ల మండల పరిధిలోని ఎర్రమట్టి తండా గ్రామంలో కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రాం నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలంతా వర్గ బేధాలు లేకుండా శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా సహకరించాలని, ఒకరికి ఒకరు కలిసిమెలిసి సామరస్యంగా ఉండాలన్నారు.
ప్రతి ఓటరు నిర్భయంగా ఓటు వేయాలని, డబ్బు మద్యం వంటి ప్రలోభాలకు లోను కాకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఇనుమడింప చేసేలా వ్యవహరించాలన్నారు. ఎక్కడైనా ఓటర్లను ప్రలోభ పెట్టే కార్యక్రమాలు సాగిస్తే సమాచారం ఇవ్వాలన్నారు. గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఎవరైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తించి గొడవలు సృష్టించాలని చూస్తే, వారిపై చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గొడవల్లో తలదూర్చే వారిపై ఎల్లప్పుడు నిఘా ఉంటుందన్నారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు, అనుమానితులు తిరిగితే వెంటనే సమాచారం అందజేయాలని అదేవిధంగా సైబర్ నేరగాళ్లు చెప్పే మోసపూరిత మాటలు నమ్మవద్దని, లోన్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఫోన్ లకు వచ్చే అనవసరపు లింకులు ఓపెన్ చేయరాదని, అపరిచితులకు బ్యాంకు ఖాతా ఏటీఎం ఓటిపి వివరాలు ఇవ్వరాదని, సైబర్ మోసంలో ఆర్థికంగా నష్టపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కార్యదర్శి అనిల్ ఎంపిటిసి మంజుల పోలీస్ సిబ్బంది రాము శ్రీనివాస్ గ్రామస్తులు తదితరులు ఉన్నారు.