గార్ల మండల కేంద్రంలోని స్థానిక కమ్యూనిటి ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ డాక్టర్ కళావతి బాయి ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించి, వైద్య సిబ్బంది పనితీరును ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని సిబ్బందికి సూచించారు. వైద్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా తక్షణమే వారికి వైద్య సేవలు అందించి, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం పనితీరును మెరుగుపరచడానికి కృషి చేయాలని ఆదేశించారు.
కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో వైద్య పరికరాల కొరత ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. సి హెచ్ సిలో ఏర్పడ్డ వైద్యుల కొరతను త్వరితగతిన భర్తీ చేయడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సత్యనారాయణ డాక్టర్ హనుమంతరావు వైద్య సిబ్బంది స్వాతి మేర్సి జూలీయా రమా తదితరులు ఉన్నారు.