ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా గార్ల రైల్వే స్టేషన్ లో పలు ఎక్స్ ప్రెస్ రైళ్ళను నిలపడంతో పాటు స్టేషన్ సమీపంలో అసంపూర్తిగా అండర్ బ్రిడ్జి పనులను పూర్తి చేయాలని ప్రయాణికుల కమిటీ ఆధ్వర్యంలో దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్ భరతేష్ కుమార్ జైన్ కు విజ్ఞప్తి చేశారు. డోర్నకల్ జంక్షన్ రైల్వే స్టేషన్ పరిశీలనకు వచ్చిన డి ఆర్ ఎం కు అందించిన వినతి పత్రం ప్రతులను స్థానిక విలేఖరులకు అందజేశారు.
గార్ల రైల్వే స్టేషన్ లో సికింద్రాబాద్ నుంచి గుంటూరు వరకు నడిచే శాతవాహన లేదా ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైళ్ళను నిలపాలని, రైల్వే స్టేషన్ లో మంచి నీటి సదుపాయం, లైట్లు, ఎలక్ట్రానిక్ డిస్ప్లే అమర్చాలని కోరారు. కాగా రైల్వే స్టేషన్ సమీపంలోని అండర్ బ్రిడ్జి పనులు అసంపూర్తిగా ఉండటంతో వర్షాకాలంలో వర్షపు నీరు నిలిచి పోవడం తో ప్రజలు రాకపోకలు సాగించ లేకపోతున్నారని, సత్వరమే అండర్ బ్రిడ్జి పనులు పూర్తి చేయించాలని ఆ వినతి పత్రంలో విజ్ఞప్తి చేశారు.
డి ఆర్ ఎం ను కలిసిన వారిలో కమిటీ సభ్యులు కందునూరి ఈశ్వర లింగం, పానుగంటి రాధా కృష్ణ, కందునూరి శ్రీనివాస్, ఏసుమల్ల రాజశేఖర్, రాజేష్, బబ్లు, బన్నీ ఉన్నారు.