సాధారణంగా కుక్కను చూస్తే ఏ కోడి అయినా తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరుగులంకించుకుంటాయి. అలాగే కుక్కలు కూడా కోళ్లు కనిపించగానే వాటిని తరుముతూ చటుక్కున పట్టుకొని నోట బెట్టుకుని తినేయాలని ప్రయత్నిస్తుంటాయి. వాటి మధ్య స్నేహం ఉందో లేదో కానీ శత్రుత్వం ఉంటుందని మాత్రం అందరికీ తెలుసు. వాటి మధ్య స్నేహం కుదురుతుందని కలలో కూడా ఎవరూ ఊహించరు. కానీ కుదిరింది. స్నేహమేరా జీవితం అంటూ.. జాతి వైరాన్ని మరచిన ఒక వీధి కుక్క కోళ్ల సమూహంతో స్నేహం చేస్తూ ఒక దగ్గరే కలిసి తింటూ మనదే నిజమైన స్నేహం అన్నట్టు ఈ మూగజీవాలు ఉంటున్నాయి.
అసలు కుక్కకు కోళ్లకు స్నేహం ఎలా కుదిరిందంటే గార్ల మండలం పరిధిలోని అంజనాపురం గ్రామం గుగులోత్ ధర్మ ఇంటి ఆవరణం సమీపంలో తిరుగుతున్న పెద్దకోడితో కలిసి తిరుగుతున్న కోళ్ల సమూహం వద్దకు వచ్చిన వీధి కుక్క వాటిని తరమకుండా వాటితో కలిసి తిరుగుతూ కోళ్లతో స్నేహం ప్రారంభించింది. తమతో స్నేహం చేస్తున్న కుక్క తమను ఏం చేయదని గ్రహించిన మిగతా కోళ్లు కూడా దానితో స్నేహం చేయడం మొదలెట్టాయి. పశువులకు పెట్టిన తౌడు కలిపిన దానాను పశువులు తినగా కిందపడిన వాటిని కోళ్ళతో కలిసి తింటున్న కుక్కను చూసి స్నేహానికి జాతి వైరుధ్యాలు లేవనడానికి ఇవే నిదర్శమని ఇది చూసినవారంతా అంటున్నారు.