Friday, November 22, 2024
HomeతెలంగాణGarla: నాసిరకం బియ్యంతో నయా మోసం

Garla: నాసిరకం బియ్యంతో నయా మోసం

చెప్పుకుంటే పరువు పోతుందని..

ఆన్‌లైన్ మోసాలు చూశాం.. లింక్ క్లిక్ చేస్తే డబ్బులు పోవడం.. ఓటీపీ చెబితే ఖాతా ఖాళీ కావడం ఇవన్నీ ఇప్పుడు మామూలు మోసాలే. కానీ గార్లలో కొత్తగా నయా మోసం వెలుగు చూసింది. ఆశతో బతికే మధ్యతరగతి ప్రజలనే లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఈ నయా మోసం తాజాగా గార్ల మండల కేంద్రంలోని పలు బజార్ లలో ట్రెండింగ్ లో ఉంది.

- Advertisement -

చెప్పుకుంటే మానం పోయే … అన్నట్లుగా తమకు జరిగిన మోసం గురించి ఎవరికీ చెప్పుకోని బాధితుల వల్ల ఈ ట్రెండ్ జోరుగా సాగుతోంది. కొందరు కేటుగాళ్లు ఏకంగా బహిరంగంగా మోసాలు సాగిస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు…. వివరాల్లోకి వెళితే.. స్కూటీ మీద వచ్చి ఏటి అవతల గొల్లగూడెం అని పొలంలో పండించిన సన్న బియ్యం అంటూ దొడ్డు బియ్యం అంటగట్టిన కొత్త మోసం జరుగుతుంది. అలికిడి ఎక్కువగా లేని సందుల్లోకి కొందరు కేటుగాళ్లు బియ్యం అమ్మకం పేరుతో కొత్త మోసాలకు పాల్పడుతున్నారు.

మధ్యతరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని మేలురకం బియ్యం తక్కువ ధరకే అందిస్తామని నమ్మబలికి వారిని నట్టేట ముంచుతున్నారు. తాజాగా గురువారం మండల కేంద్రంలోని స్థానిక తాసిల్దార్ బజార్ వడ్డెర బజార్ ఎరుకల బజార్ బెస్త బజార్ జనసంచారం ఎక్కువగా లేని ఓ వీధిలోకి ఈ కేటుగాళ్లు బియ్యం అమ్ముతున్నామని వచ్చారు. ఓ కుటుంబాన్ని మాటల్లో పెట్టి మేలు రకం జైశ్రీరాం హెచ్ఎంటి సన్న బియ్యం తక్కువ ధరకు ఇస్తామని ఆశ చూపారు. అసలైన బియ్యం శాంపిల్ సంచిలో నుండి తీసి ఇవే బియ్యం అని చూపించారు. ధర కాస్త ఎక్కువగా చెప్పి మీ కోసం తగ్గిస్తామంటూ నమ్మబలికారు. మార్కెట్లో సుమారు ఏడు వేల వరకు క్వింటాల్ పలుకుతున్న జైశ్రీరాం బియ్యం చివరకు 5 వేలకు క్వింటాల్ ఇస్తామని ఆశచూపారు. 25 కిలోలు కొనడానికి ఒప్పుకున్న కుటుంబాన్ని మాటలతో మాయ చేసి క్వింటాల్ కొనేలా ఒప్పించారు. నాసిరకం బియ్యం ఉన్న సంచులను వారికి విక్రయించి చల్లగా జారుకున్నారు. దొరికిన సొమ్ముతో దొరల్లా వెళ్లిపోయారు.

తీరా ఆ కుటుంబం ఒక్కో సంచీ తెరిచి చూసి గొల్లుమన్నారు. ప్రతి సంచిలోనూ పుట్టెడు పురుగులతో ఉన్న దొడ్డు బియ్యం చూసి ఖంగుతిన్నారు. ఈ విషయం తెలుసుకునేలోపే సదరు కేటుగాళ్లు కాళ్లకు బుద్ధి చెప్పారు. అసలైన రకం బియ్యం అగ్గువగా వస్తున్నాయని ఆశ పడిన ఆ కుటుంబం నిలువునా మోసపోయింది. ఇలా కొందరు కేటుగాళ్లు గ్రామాల్లో రెక్కీ చేస్తూ చడీ చప్పుడు లేని సంధులను ఎంచుకుని తమ వాటం ప్రదర్శిస్తున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు.

అయితే మోసపోయిన కుటుంబాలు ఇంట్లో గొడవలు జరుగుతాయనే కారణంతో ఫిర్యాదు చేయడానికి, ఇతరులతో ఈ విషయం చెప్పుకోవడానికి పరువు పోతుందనే భయంతో ఇష్టపడడం లేదు. ఇది ఆ కేేటుగాళ్లకు మంచి అవకాశంగా మారింది.
దీంతో వారు మరింత రెచ్చిపోతున్నారు. వెంటనే ఈ బియ్యం కేటుగాళ్లను సంబంధిత అధికారులు నిఘా పెట్టి వారిని పట్టుకుని శిక్షించాలని లేకపోతే మరిన్ని కుటుంబాలు కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ము వారిపాలు చేయాల్సి వస్తుందని స్థానికులు కోరుతున్నారు. ఏది ఏమైనా పేదోడి ఆశనే పెట్టుబడిగా చేసుకుని నయా మోసం చేస్తున్న నయవంచకులను సాధ్యమైనంత త్వరగా పట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News