గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో గార్ల సమీపంలోని పాకాల ఏరు చెక్ డ్యామ్ పైనుంచి నీరు ఉదృతంగా పొంగి ప్రవహిస్తోంది. దీంతో గార్లకు కూతవేటు దూరంలో ఉన్న రాంపురం పంచాయతీ పరిధిలోని రాంపురం, కొత్తతండా, పులి గుట్ట తండా, మద్దివంచ పంచాయతీ పరిసర గ్రామాలతో పాటు మరో 15 గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాకాలంలో మూడు నెలల పాటు ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
రాంపురం నుంచి ప్రజలు గార్ల చేరుకోవాలంటే 20 కిలోమీటర్ల చుట్టూ బయ్యారం నుండి తిరిగి రావలసిన పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పాకాల ఏటి నీటి వృద్ధిని బుధవారం గార్ల బయ్యారం సీఐ రవికుమార్ ఎస్సై జీనత్ కుమార్ లు పరిశీలించారు. ఏటి చెక్ డ్యాం పై పాదాచారులు వాహనదారులు రాకపోకలు, జరపకుండా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చెక్ డాం వద్ద భారీ గేట్లను ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు స్థానికుడు మోహిన్ ఉన్నారు.