ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వైద్య సేవలు అందించాలని
ఇన్చార్జి ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రథమ చికిత్స చేస్తున్న ఆర్ఎంపిలు పరిమితికి మించిన వైద్యం చేస్తున్నారని, దానివల్ల ప్రజలు వివిధ రకములుగా అనారోగ్యం పాలై , కొన్ని చోట్ల పరిస్థితులు విషమించి ప్రాణాలు కోల్పోయినట్లుగా ఆరోపణలు రావటంతో డిఎంహెచ్వో ఆదేశాల మేరకు గార్ల మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో ఇంచార్జీ ప్రభుత్వ వైద్య అధికారి డాక్టర్ రాజ్ కుమార్ జాధవ్ అధ్యక్షతన ప్రథమ చికిత్స చేస్తున్న ఆర్ఎంపి / పిఏంపిలు / ల్యాబ్ , ఎక్స్ రే, ఫార్మసీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ రాజ్ కుమార్ జాధవ్ మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అత్యవసర సమయాల్లో నిత్యం అందుబాటులో ఉంటూ ప్రథమ చికిత్స అందిస్తున్న వారిని అభినందించారు. కానీ కొందరి పరిమితికి మించిన వైద్యం అందించడం వల్ల ప్రజలకు ఆరోగ్య తలెత్తుతున్నాయన్నారు. అలా ఎవరూ పరిమితికి మించిన వైద్యం అందించకూడదని, అమాయక ప్రజల ఆరోగ్యాలతో ఎవరూ ఆడుకోకుడదని అన్నారు. ప్రథమ చికిత్స కేంద్రాలు గ్రామీణ ప్రజల ఆరోగ్య, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు.
చికిత్స కేంద్రం బోర్డుపై ప్రథమ చికిత్స కేంద్రం లేదా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అని వ్రాయాలన్నారు, పేరుకు ముందు డాక్టర్ అని వ్రాసుకోకూడదని అన్నారు, స్వయంగా రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించుట, ఇంజక్షన్ లు వేయుట, మందుల చిట్టిలు ఇచ్చుట , సెలైన్ బాటిల్స్ ఎక్కించుట, ఇన్ పేషెంట్ బెడ్ నిర్వహించుట వంటివి చేయకూడదని అన్నారు.
రోగులకు ఇన్ పేషెంట్ వైద్యం, ల్యాబ్ (రక్త మూత్ర పరీక్షల) నిర్వాహణ చేయకూడదని సూచించారు. రోగులకు హై డోస్ అంటిబయేటిక్స్ , స్టెరాయిడ్స్, నొప్పికి సంబంధించిన మందులు వాడటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు.
రక్త మూత్ర పరీక్షలు , లింగ నిర్ధారణ , అబార్షన్లు చేయుట, కాన్పూలు నిర్వహించుట వంటివి చేయకూడదని అన్నారు. రోగులను ప్రలోభపరిచి అనవసరంగా కార్పోరేట్ ఆసుపత్రులకు సిఫార్స్ చేయకూడదని, గర్భిణీ స్త్రీలకు సాధారణ ప్రసవాలకు ప్రోత్సహించాలని సూచించారు. అందరూ అనుమతులు తీసుకోవాలని, ఉన్నత వైద్యాధికారుల ఆకస్మిక తనిఖీల సమయంలో పరిమితులు ఉల్లంఘించిన వారిపై క్లినికల్ ఎస్టబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యూలేషన్ యాక్ట్ 2012/11 ప్రకారం చట్టపరమైన చర్య తీసుకుంటారని, నిబంధనలు ఉల్లంఘించకుండా సహకరించాలన్నారు.