Saturday, November 15, 2025
HomeTop StoriesGau Rakshak : గో సంరక్షకుడిపై కాల్పుల కలకలం.. హైదరాబాద్ శివార్లలో ఘాతుకం!

Gau Rakshak : గో సంరక్షకుడిపై కాల్పుల కలకలం.. హైదరాబాద్ శివార్లలో ఘాతుకం!

Gau Rakshak shot in Hyderabad : గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిని అడ్డుకుంటున్నాడన్న కక్ష.. పట్టపగలే తుపాకీతో కాల్పులకు దారితీసింది. హైదరాబాద్ శివారు పోచారం ఐటీ కారిడార్ పరిధిలో బుధవారం ఓ గో సంరక్షకుడిపై జరిగిన ఈ దాడి, నగరంలో శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఈ దాడి వెనుక ఉన్నది ఎవరు? ఈ ఘటనపై రాజకీయ దుమారం ఎందుకు రేగుతోంది?

- Advertisement -

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..
లక్ష్యం సోనూసింగ్: కీసర మండలం, రాంపల్లికి చెందిన సోనూసింగ్ అలియాస్ ప్రశాంత్, గో సంరక్షణ కార్యకర్తగా పనిచేస్తున్నారు. గోవులను అక్రమంగా తరలించే వారిని అడ్డుకుంటూ, ఆ సమాచారాన్ని హిందూ సంఘాలకు చేరవేస్తుంటారు.

వెంబడించి, అడ్డగించి : బుధవారం సాయంత్రం, సోనూసింగ్ కారులో వస్తుండగా, బహదూర్‌పురాకు చెందిన ఇబ్రహీం, అతని స్నేహితులు మరో కారులో వెంబడించారు. యమ్నంపల్లి వద్ద సోనూసింగ్ కారును అడ్డగించారు.

కాల్పులతో బీభత్సం: “గోవుల తరలింపు విషయం గోరక్షాదళ్‌కు ఎందుకు చెబుతున్నావ్?” అంటూ సోనూసింగ్‌తో వాగ్వాదానికి దిగారు. గొడవ ముదరడంతో, ఇబ్రహీం తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఒక తూటా సోనూసింగ్ పక్కటెముకల్లోకి దూసుకెళ్లడంతో, అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. నిందితులు వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు.

పరిస్థితి విషమం.. కొనసాగుతున్న చికిత్స : స్థానికులు సోనూసింగ్‌ను హుటాహుటిన మేడిపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి, ఆ తర్వాత సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు.
“బుల్లెట్ కాలేయాన్ని తాకడంతో, బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. అత్యవసర శస్త్రచికిత్స నిర్వహిస్తున్నాం,” అని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, ఎంపీ ఈటల రాజేందర్ వంటి ప్రముఖులు ఆసుపత్రికి వెళ్లి, సోనూసింగ్‌ను పరామర్శించారు.

రాజకీయ దుమారం.. బీజేపీ ఫైర్ : ఈ ఘటనపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మజ్లిస్ ఆగడాలు పెరిగిపోయాయని ఆరోపించారు.

“గోవులను అక్రమంగా రవాణా చేయకూడదని చట్టం ఉంటే, దానిని రక్షించే గోరక్షకులపైనే కాల్పులు జరపడం దుర్మార్గం. దీన్ని అరికట్టకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి.”
– కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి

“ఇంతకుముందు కూడా ఇబ్రహీం మాపై ఓఆర్‌ఆర్‌పై దాడి చేశాడు. అప్పుడే పోలీసులు కఠిన చర్యలు తీసుకుని ఉంటే, ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు,” అని మరో గో సంరక్షక కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశారు.

ముగ్గురు అరెస్ట్.. ఒకరు పరారీ : ఈ ఘటనపై వేగంగా స్పందించిన రాచకొండ పోలీసులు, ప్రధాన నిందితుడు ఇబ్రహీంతో పాటు, మోసిన్, శ్రీనివాస్‌లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడు హనీఫ్ ఖురేషీ కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad