Monday, November 17, 2025
HomeతెలంగాణKTR: కేసు నమోదుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్.. కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం..!?

KTR: కేసు నమోదుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్.. కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం..!?

KTR| తెలంగాణలో ఒకట్రెండు రోజుల్లో మరో సంచలన పరిణామం చోటు చేసుకోనుంది. ఈసారి ఏకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అరెస్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్వహించిన ఫార్ములా-ఈ కార్‌ రేసు(Formula E car race) వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై ఎఫ్‌ఐఆర్(FIR)‌ నమోదు చేసేందుకు గవర్నర్‌ జిష్ణుదేవ్ శర్మ(Jishnu Dev Varma) అనుమతి ఇచ్చినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. రెండు రోజుల క్రితమే సంబంధిత ఫైల్ రాష్ట్ర ప్రభుత్వానికి చేరినట్లు సమాచారం.

- Advertisement -

హైదరాబాద్‌లో జరిగిన కార్‌ రేసుకు సంబంధించి ఉల్లంఘనలు జరిగాయని దీనిపై విచారణ చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి సంస్థ అక్టోబరులో ఏసీబీకి ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంతో సంబంధం లేని హెచ్‌ఎండీఏ(HMDA) ఒప్పందం చేసుకోవడం, రిజర్వు బ్యాంకు ముందస్తు అనుమతి లేకుండానే రెండు దఫాలుగా రూ.46 కోట్లను విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించారని ఫిర్యాదులో పేర్కొంది. హెచ్ఎండీఏ అనుమతి లేకుండా మంత్రిగా కేటీఆర్ చెల్లింపులు చేశారని ఆరోపించింది.

దీంతో మాజీ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, అప్పటి చీఫ్‌ ఇంజినీరుతోపాటు కేటీఆర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి అనుమతివ్వాలని ప్రభుత్వాన్ని ఏసీబీ కోరింది. ఈ మేరకు ఇద్దరు అధికారులపై విచారణకు అనుమతిచ్చిన ప్రభుత్వం… ప్రజాప్రతినిధి అయిన కేటీఆర్‌పై మాత్రం కేసు నమోదుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్‌కు గత నెలలో లేఖ రాసింది. దీనిపై న్యాయ సలహా తీసుకున్న గవర్నర్‌ ఆయనపై కేసు నమోదుకు అనుమతిచ్చినట్లు రాజ్ భవన్ వర్గాల విశ్వసనీయ సమాచారం.

కాగా గవర్నర్ అనుమతి ఇస్తే కేటీఆర్‌పై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కేటీఆర్ అరెస్ట్ కావడం ఖాయంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad