కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో కలెక్టర్ పై దాడి ఘటన రాష్ట్రంలో రాజకీయ చిచ్చుకి తెరలేపింది. అభివృద్ధిని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ పన్నిన కుట్ర ఇది అని అధికార పార్టీ ఆరోపిస్తుండగా.. పేదల భూములు కాజేసేందుకు రేవంత్ సర్కార్ అన్యాయంగా బాధితులపై కేసులు పెడుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
అయితే లగచర్ల ఘటనలో కుట్రకోణం ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం ఆ దిశగా విచారణ చేపట్టింది. ఇప్పటికే పోలీసులు పలువురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నిజాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, లగచర్ల ఘటనలో పరిగి డీఎస్పీ (Parigi DSP) కరుణాసాగర్ రెడ్డి పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆయనని డీజీపీ ఆఫీస్ కి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. పరిగి కొత్త డీఎస్పీ (Parigi new DSP)గా ఎన్ శ్రీనివాస్ ని నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటనకు సంబంధించి మరికొంత మంది అధికారులపై వేటపడే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.