ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పటాన్చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని, ప్రతి పేదవాడి సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి కార్యాలయం, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం, ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాల ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ అమరవీరుల స్థూపానికి ఘన నివాళులు అర్పించారు. బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. 13 సంవత్సరాల పాటు పోరాడి సాధించుకున్న తెలంగాణను నేడు బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడంతోపాటు దేశంలోని అగ్రగామిగా తీర్చిదిద్దిన మహోన్నత నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పటాన్చెరు నియోజకవర్గాన్ని ప్రగతికి ప్రతీకగా తీర్చిదిద్దామని తెలిపారు. 9 ఏళ్ల పరిపాలనా కాలంలో పటాన్చెరు రూపురేఖలు మార్చడంతో పాటు ప్రజలను సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేయడం జరిగిందని తెలిపారు. ప్రధానంగా పల్లె ప్రగతి పట్టణ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రతినెల గ్రామాలు పట్టణాల అభివృద్ధికి నిధులు కేటాయించడంతోపాటు ప్రతి గ్రామంలో పరిశుభ్రత పచ్చదనం పెంపొందించడంలో సఫలీకృతులమయ్యామని తెలిపారు.
పటాన్చెరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు సాధించాయని గుర్తు చేశారు. ప్రభుత్వం అందించే నిధులతోపాటు వివిధ పరిశ్రమల సహకారంతో సిఎస్సార్ నిధులను వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని తెలిపారు. 2018 ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలలో ప్రధానమైన బీరంగూడ కిష్టారెడ్డిపేట రహదారి విస్తరణ పనులు పూర్తి చేయడంతో పాటు సబ్ రిజిస్టర్ కార్యాలయం సైతం త్వరలోనే ప్రారంభించిపకోనున్నట్లు తెలిపారు. నిరుపేదలకు సొంతింటి కలలు సాకారం చేయాలన్న సమున్నత లక్ష్యంతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ లను సైతం ప్రజలకు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
ప్రజల సహాయ సహకారాలతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు పాండు, పట్టణ అధ్యక్షులు అఫ్జల్, వివిధ శాఖల అధికారులు, పట్టణ పుర ప్రముఖులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.