అచ్చంపేట నియోజకవర్గ ప్రాంతాన్ని సుందర నగరంగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ అన్నారు. పట్టణంలోని ఫంక్షన్ హాల్ లో జరిగిన నియోజకవర్గ స్థాయి, అధికారులు పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అచ్చంపేటలో రూ.4.5 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు నిర్మాణం చేపడుతామని, మార్కెట్ యార్డును ప్రజలకు అవసరమయ్యే విధంగా సుందరంగా నిర్మించి మార్కెట్ యార్డు చుట్టూ రోడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా స్మృతి వనాన్ని గొప్పగా తయారు చేయడం జరిగిందన్నారు. తెలంగాణలో 5 వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రులు మంజూరు అయితే అందులో ఒకటి మన అచ్చంపేట కు తీసుకువచ్చామన్నారు.
ఉమామహేశ్వర ప్రాజెక్టు టెండర్లు పూర్తి అయ్యావని, త్వరలోనే సీఎం కేసీఆర్ తో ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈనెల 16న పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వెట్ రన్ న్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన అనంతరం నిర్వహించే బహిరంగ సభకు అన్ని మండల, గ్రామాల నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎడ్ల నర్సింహ గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు మనోహర్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ శ్రీమతి అరుణ, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శ్రీమతి శైలజ విష్ణువర్ధన్ రెడ్డి, ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, వివిధ గ్రామాల సర్పంచులు , డివిజన్ మరియు మండల స్థాయి వివిధ శాఖల అధికారులు,ఎంపీటీసీలు,రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.